సరదా సందేశాల కారణంగా కొందరి ప్రాణాలు పోతున్నాయి: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం
- దేశంలో కొవిడ్ విజృంభణ
- సోషల్ మీడియా ద్వారా సాయం చేస్తున్న రేణు
- సాయం కోరుతూ సందేశాలు వస్తున్నాయని వెల్లడి
- కొందరు హలో, హాయ్ సందేశాలు పంపుతున్నారని ఆరోపణ
- ఆపదలో ఉన్నవారిని గుర్తించలేకపోతున్నానని విచారం
ప్రముఖ నటి రేణు దేశాయ్ నెటిజన్లకు కీలక సందేశం అందించారు. ఇటీవల తాను సోషల్ మీడియా (ఇన్ స్టాగ్రామ్) ద్వారా కరోనా బాధితులకు ఆసరాగా నిలుస్తున్నానని వెల్లడించారు. అయితే, సాయం కోరుతూ కొందరు తనకు పంపిస్తున్న విజ్ఞప్తులు, కొందరు నెటిజన్లు పంపే సరదా సందేశాల కారణంగా ఇన్ బాక్స్ లో కిందికి వెళ్లిపోతున్నాయని, దాంతో ఆపదలో ఉన్నవారెవరో తాను తెలుసుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సరైన సమయంలో సాయం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దయచేసి తనకు హాయ్, హలో అంటూ సందేశాలు పంపవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం తాను నేరుగా ఎవరికీ ఆర్థికసాయం అందించడంలేదని, అయితే, సాయం కోరిన వారికి ఆసుపత్రులు, మందుల విషయంలో సహకరిస్తున్నానని రేణు వివరించారు. తనకు ట్విట్టర్ లో ఎలాంటి ఖాతా లేదని, తన పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.