ఢిల్లీలో పీఎం స్వనిధి ఉత్సవాలు.. పాల్గొననున్న వరంగల్ చాయ్‌వాలా, సిరిసిల్ల పండ్ల వ్యాపారి…
- ఢిల్లీలో 1 నుంచి 3 వరకు ఉత్సవాలు
- పథకం ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా ఉత్సవాల నిర్వహణ
- ఇద్దరు మెప్మా అధికారులు, ఇద్దరు వీధివ్యాపారులను ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం
దేశరాజధాని ఢిల్లీలో రేపటి నుంచి మూడో తేదీ వరకు జరగనున్న పీఎం స్వనిధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వరంగల్‌కు చెందిన చాయ్ వ్యాపారి, సిరిసిల్లకు చెందిన పండ్ల వ్యాపారికి ఆహ్వానం అందింది. పీఎం స్వనిధి పథకం ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉత్సవాల నిర్వహణకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు వీధి వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
వీరిలో మెప్మా కేంద్ర కార్యాలయానికి చెందిన కృష్ణ చైతన్య, శివకుమార్‌తోపాటు వరంగల్‌కు చెందిన చాయ్ వ్యాపారి మహ్మద్ మహబూబ్ పాషా, సిరిసిల్లకు చెందిన పండ్ల వ్యాపారి గడ్డం కృష్ణయ్య ఉన్నారు. కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన పాషా పీఎం స్వనిధి పథకంలో తొలి విడత రూ. 10 వేలు, రెండో విడతలో రూ. 20 వేలు, మూడో విడతలో రూ. 50 వేలు రుణం తీసుకుని వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు. ఢిల్లీ ఉత్సవాలకు పిలుపు అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పాడు.