- నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చిన ఏజెంట్
- నిరసనలకు దిగిన బాధిత విద్యార్థులు
- సీబీఎస్ఏ సెంటర్ వెలుపల నిరసనలకు దిగిన విద్యార్థులు
ఉన్నత విద్యను అభ్యసించేందుకు పంజాబ్ నుంచి కెనడా వెళ్లిన దాదాపు 700 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. జలంధర్‌కు చెందిన ఏజెంట్ వారి చేతిలో పెట్టిన ఫేక్ ఆఫర్ లెటర్లతో వెళ్లిన వారంతా మోసపోయామని తెలిసి విలవిల్లాడుతున్నారు. చేసేది లేక టొరంటోలోని మిస్సిసాగాలో ఉన్న కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీబీఎస్ఏ) కాన్ఫరెన్స్ సెంటర్ వెలుపల మే 29 నుంచి నిరసనకు దిగారు. ఒంటారియాలోనూ ఇలాంటి నిరసనలే జరుగుతున్నాయి.
బాధిత విద్యార్థులు కెనడా ఇమిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రాసెర్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులు తీసుకెళ్లిన ఆఫర్ లెటర్లను అక్కడి విద్యాసంస్థలు నకిలీవిగా గుర్తించడంతో సీబీఎస్ఏ వారికి బహిష్కరణ లేఖలు అందించింది.
ఈ నేపథ్యంలో వారిని తిరిగి భారత్ పంపేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొందరు విద్యార్థులు భారత్ చేరుకున్నట్టు సమాచారం. విద్యార్థులకు నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చిన ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ బ్రిజేశ్ మిశ్రా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాడు.