- మృతులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నట్లు వెల్లడి
- సోమ, మంగళ వారాల్లో గ్రామంలో సర్వమత ప్రార్థనలు
- గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తామని వివరణ
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత వేగంగా స్పందించిన బహనాగ గ్రామస్తులు తాజాగా తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ కర్మలు చేశారు. రైలు ప్రమాదంలో చనిపోయిన 288 మందికి తాజాగా దశదిన కర్మ చేశారు. గ్రామస్తులంతా జుత్తు, గడ్డం, మీసం తీసేసి సంప్రదాయబద్ధంగా ఈ తంతు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రైలు ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇంకా 81 మృతదేహాలను ఎవరూ గుర్తించలేదు. దీంతో అవి మార్చురీలోనే ఉన్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారికి ఉత్తరక్రియలు నిర్వహించకుంటే ఆత్మలకు శాంతి కలగదని గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 288 మంది మృతులనూ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ దశ దిన కర్మ చేసినట్లు చెప్పారు. సోమ, మంగళవారాల్లో గ్రామంలో సర్వమత సభ ఏర్పాటు చేసి వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేస్తామని వివరించారు. రైలు ప్రమాదంలో గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని పూజలు చేస్తామని వివరించారు.