తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది: మంత్రి హరీశ్ రావు!
- శాఖ ఏదైనా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అంటూ హరీశ్ వ్యాఖ్యలు
- కేసీఆర్ నెంబర్ వన్ కాబట్టే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని వెల్లడి
- ప్రజలకు కేసీఆర్ ఇచ్చేవి కిట్లు… ప్రతిపక్షాలవి తిట్లు అంటూ వ్యంగ్యం
నిమ్స్ ఆసుపత్రిలో దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఏ శాఖ తీసుకున్నా తెలంగాణనే నెంబర్ వన్ అని స్పష్టం చేశారు.
కేసీఆర్ నెంబర్ వన్ కాబట్టే తెలంగాణ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది అని హరీశ్ రావు వివరించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కందిళ్ల మోతలు ఉండేవని… కేసీఆర్ పాలనలో కరెంటు వెలుగులు, కంటి వెలుగులతో ఉజ్వలంగా ఉందని వెల్లడించారు.
మహిళలు గర్భవతులు కాగానే న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామని, కడుపులోంచి బిడ్డ బయటకు రాగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చేవి కిట్లు… ప్రతిపక్షాలవి తిట్లు అని హరీశ్ రావు విమర్శించారు. ఇతర రాష్ట్రాలు సైతం కేసీఆర్ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.