వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా: పవన్ కల్యాణ్
- నిన్న కత్తిపూడి సభలో వైసీపీపై పవన్ విమర్శలు
- కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
- వైసీపీ నేతల పిచ్చి విమర్శలు పట్టించుకోబోనన్న జనసేనాని
- తాము సీరియస్ రాజకీయాలు చేస్తున్నామని వ్యాఖ్య
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన ప్రముఖులతోనూ సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, వైసీపీ నేతలు తనను తిడుతుండడంపై స్పందించారు. వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. తాము సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నామని, వైసీపీ నేతలు చేసే పిచ్చి విమర్శలు పట్టించుకోబోమని అన్నారు. తాము మాటలతో కాదని, ఏదైనా చేతలతోనే చూపిస్తామని స్పష్టం చేశారు. రానున్న కాలంలో వారి ప్రతి మాటకు సమాధానం మార్పు ద్వారా వస్తుందని హెచ్చరించారు.
ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నామని, అందుకోసమే జనవాణి కార్యక్రమం తీసుకువచ్చామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇవాళ జనవాణి కార్యక్రమంలో 32 అర్జీలు స్వీకరించామని తెలిపారు. ప్రజలు చైతన్యంగా లేకపోతే అరాచకం రాజ్యమేలుతుందని అన్నారు. అరాచకాలకు జనవాణి కార్యక్రమంతో అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు.
వివిధ సమస్యలపై తమకు అందిన పిటిషన్లను పరిష్కారం కోసం ఆయా విభాగాలకు పంపుతామని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో మార్పు తెచ్చేలా వారాహి యాత్ర ఉంటుందని పవన్ వివరించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలనేదే జనసేన ధ్యేయం అని, కులాలుగా విడిపోకుండా ఆంధ్రా అనే భావనతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమం కోసమే యాత్ర చేపడుతున్నామని, జనసేన చేపట్టిన వారాహి యాత్రకు ప్రజల ఆశీస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు.