బీఆర్ఎస్.. ఐఆర్ఎస్ అయినా సరే సపోర్ట్ చేస్తా: సీనియర్ నటుడు సుమన్
- రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచించడం లేదన్న సుమన్
- తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తన మద్దతు అని వ్యాఖ్య
- తన అభిమాని పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు వెల్లడి
రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలా, జాతీయ రాజకీయాల్లో ఉండాలా అనే విషయం గురించి తాను ఆలోచించలేదని సీనియర్ సినీ నటుడు సుమన్ అన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తన సపోర్ట్ అని చెప్పారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని సుమన్ దర్శించుకున్నారు. తర్వాత ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీ అయ్యింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఐఆర్ఎస్ అయినా నేను మద్దతు ఇస్తా. కేసీఆర్ మీద నాకు అంత అభిమానం ఉంది’’ అని చెప్పారు. ప్రస్తుతానికి రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచించడం లేదని.. తన దృష్టి సినిమాలపైనే అని చెప్పారు.
‘‘తిరుమల వెళ్లి దండం పెట్టడం తప్ప వెంకటేశ్వరస్వామి మీద నాకు అంత భక్తి ఉండేది కాదు. పెద్దగా కేర్ చేసేవాడిని కాదు. అయితే అన్నమయ్య సినిమాలో ఏడుకొండల వాడి పాత్ర చేసిన తర్వాత నా మీద వెంకన్నకు అంత ప్రేమ, ఇష్టం ఉన్నాయని తెలిసింది. అందుకే ఆయన పాత్రను నేను పోషించే అవకాశం కల్పించాడని తెలుసుకున్నా’’ అని చెప్పారు. తిరుపతిలో ఉన్న తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు.