మేము కూడా చెప్పులు చూపిస్తాం: అంబటి రాంబాబు
- చెప్పులు చూపించకూడదయ్యా పవన్ కల్యాణ్ అంటూ అంబటి రాంబాబు హితవు
- ఎవరి వెంటో తిరిగితే సీఎం ఎలా అవుతారని ప్రశ్న
- పవన్ రాజకీయాలకు పనికిరారని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే, రెండు చెప్పులు చూపించేవాళ్లు తమ వైసీపీలో లేరా? అని అన్నారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే, తమ పేర్ని నాని రెండు చెప్పులు చూపించారని… పవన్ రెండు చూపిస్తే తాము నాలుగు చూపిస్తామని అన్నారు. పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి చాలా సంయమనంతో ఉండాలని అన్నారు. చెప్పుల రాజకీయం చేస్తున్నది తాము కాదని, పవన్ కల్యాణ్ చేస్తున్నారని విమర్శించారు. చెప్పులు చూపించకూడదయ్యా పవన్ కల్యాణ్ అని హితవు పలికారు. పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మకూడదని చెప్పారు. ఎవరి వెంటో తిరిగితే ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎద్దేవా చేశారు.
సినిమాల్లో హీరోగా పవన్ కు మంచి ఇమేజ్ ఉందని… సినిమాల్లో హీరోగా ఉన్నా ఆయన రాజకీయాల్లో కామెడీ నటుడు అయ్యారని అంబటి అన్నారు. సినిమాల్లో హీరోగా ఉన్న వ్యక్తి రాజకీయాల్లో కూడా హీరో కాగలరని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. రాజకీయాల్లో తాను హీరోను కానని చిరంజీవి పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ లక్ష్యం సీఎం కావడమా? లేక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడమా? అని ప్రశ్నించారు. పవన్ కు స్థిరత్వం లేదని, ఆయన రాజకీయాలకు పనికిరారని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలసికట్టుకుని వచ్చినా గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.