జర్మనీలో తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. ఇప్పటికీ తళతళలాడుతూనే..!
- నార్డ్‌లింగెన్‌లోని బవేరియన్ పట్టణంలో తవ్వకాలు
- సమాధిలో పురుషుడు, స్త్రీ, చిన్నారి అవశేషాలు
- ఇప్పటికీ నిగనిగలాడుతూ మెరుస్తున్న అష్టభుజి కత్తి
- నిపుణుడైన పనివాడు తయారుచేసి ఉంటాడంటున్న శాస్త్రవేత్తలు
జర్మనీలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఖడ్గం బయటపడింది. దాదాపు 3 వేల సంవత్సరాలైనా అది ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గకుండా మెరుస్తుండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. నార్డ్‌లింగెన్‌లోని బవేరియన్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఓ పురుషుడు, మహిళ, ఓ చిన్నారి సమాధిలో ఈ పొడవైన కత్తి కనిపించినట్టు బవేరియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ తెలిపింది. ముగ్గురిని ఒకరి వెంట మరొకరిని ఖననం చేశారని, వారి మధ్య సంబంధం ఏంటనేది తెలియరాలేదని పేర్కొంది.
ఖడ్గాన్ని అద్భుతంగా సంరక్షించడంతో అది ఇప్పటికీ నిగనిగలాడుతూ మెరుస్తోంది. ఇది కాంస్య యుగానికి చెందిన అష్టభుజ కత్తి రకం. దీని అష్టభుజి పిడిని పూర్తిగా కాంస్యంతో తయారుచేశారు. ఇది 14వ శతాబ్దాంతానికి చెందినదని, ఆ కాలం నాటివి ఈ ప్రాంతంలో దొరకడం చాలా అరుదైన విషయమని, ఎందుకంటే మధ్య కాంస్య యుగం నాటి సమాధులు శతాబ్దాలుగా లూటీకి గురయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
నిపుణులైన వారు మాత్రమే ఈ అష్టభుజి ఖడ్గాలను తయారుచేయగలరు. దీని పిడికి రెండు రివిట్లు ఉన్నాయి. ఓవర్‌లే కాస్టింగ్ (అచ్చు) టెక్నిక్ ద్వారా ఈ కత్తి బ్లేడును రూపొందించారు. అయితే, దీనిపై కట్ మార్కులు కానీ, దుస్తుల్లో ధరించిన ఆనవాళ్లు కానీ లేవు. దీంతో దీనిని వేడుకల్లో ప్రదర్శించేందుకు ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.