Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!

  • నగరంలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం
  • కాలేజీలో శుక్రవారం డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్ష
  • హిజాబ్ ధరించిన తమను సిబ్బంది పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదంటూ విద్యార్థినుల ఆరోపణ
  • పరీక్ష కేంద్రం వద్ద ఉద్రిక్తత, అనంతరం హిజాబ్‌తో విద్యార్థినులకు పరీక్ష రాసేందుకు అనుమతి
  • ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీకి తల్లిదండ్రుల ఫిర్యాదు
  • కాలేజీ నిర్వాహకులతో మాట్లాడతామని మంత్రి హామీ  

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం తలెత్తింది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన కొందరు ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్‌ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. హిజాబ్‌తో పరీక్ష కేంద్రంలోకి రావద్దని సిబ్బంది తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు, కాలేజీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలిసింది. చివరకు కొందరు హిజాబ్ తీసేసి పరీక్షకు హాజరైనప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిగతా వారిని హిజాబ్‌తోనే పరీక్షకు అనుమతించినట్టు సమాచారం. ఈ వివాదం కారణంగా తాము అరగంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభించామని విద్యార్థినులు చెప్పారు. తదుపరి పరీక్షకు హిజాబ్ లేకుండా రావాలని కూడా సిబ్బంది ఆదేశించారని అన్నారు. మరోవైపు, ఈ వార్తలను కాలేజీ యాజమాన్యం ఖండించింది. హిజాబ్ ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది.

ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడతామని కూడా విద్యార్థినుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

Related posts

ఆర్టీసీ బిల్లు వివాదం: రాజ్ భవన్ ను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

Ram Narayana

కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!

Ram Narayana

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

Ram Narayana

Leave a Comment