మాజీ మంత్రి కేకే శైలజ వ్యవహారంపై సీతారాం ఏచూరి స్పందన…
కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకే పాతవారిని కాబినెట్ లోకి తీసుకోలేదని వ్యాఖ్య
కేకే శైలజను కేబినెట్‌లోకి ఎందుకు తీసుకోలేదో చెప్పిన
ఎవరిని మంత్రిగా తీసుకోవాలనేది రాష్ట్ర కమిటీల చేతుల్లోనే ఉంటుంది
రాష్ట్ర, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కొత్త వారిని తీసుకున్నాం
శైలజను కేబినెట్‌లోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియా ఉద్యమం
కేరళ మాజీ మంత్రి కేకే శైలజకు పినరయి విజయన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నిన్న రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే శైలజకు మంత్రి పదవి దక్కకపోవడంపై వివరణ ఇచ్చారు.
రాష్ట్రం, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కేబినెట్‌లోకి కొత్త వారిని తీసుకున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికివ్వాలి? మంత్రిగా ఎవరిని తీసుకోవాలి? అనేది పూర్తిగా ఆయా రాష్ట్రాల కమిటీల చేతుల్లో ఉంటుందన్నారు. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు, కరోనా తొలి దశను అడ్డుకోవడంలో చక్కటి పనితీరు కనబరిచిన కేకే శైలజను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం జరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.