- 30 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కేసీఆరే సిద్ధం చేశారన్న సంజయ్
- అందులో గెలిచిన వాళ్లు తర్వాత బీఆర్ఎస్ లో చేరుతారని ఆరోపణ
- తాము అధికారంలోకొస్తే కేసీఆర్ సర్కార్‌లోని మంచి పథకాలు కొనసాగిస్తామని ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆరే నిర్ణయిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 30 మంది అభ్యర్థుల జాబితాను ఆయనే సిద్ధం చేశారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు తర్వాత బీఆర్ఎస్ లో చేరుతారని ఆరోపించారు. బీజేపీ నుంచి ఏ ఒక్కరూ బయటకు వెళ్లరని స్పష్టం చేశారు.
కరీంనగర్‌లో మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ‘టిఫిన్ బైటక్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ‘‘తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారు. అభివృద్ధి నిధులపై సీఎం చర్చకు వస్తారా? తెలంగాణ అభివృద్ధిపై చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వస్తారు. పరేడ్ గ్రౌండ్‌లో చర్చకు సిద్ధమా?’’ అని సవాల్ విసిరారు.
మహిళల దుస్తుల మీద కాకుండా.. ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టాలని మంత్రి మహమూద్ ఆలీకి బండి సంజయ్ సూచించారు. అసలు మహమూద్ ఆలీ హోంమంత్రి అని ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. మహిళలు గాజులు, బొట్టు పెట్టుకుంటే తీసేసినప్పుడు వీళ్లు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌కు వణుకని అన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ సర్కార్‌లోని మంచి పథకాలు కొనసాగిస్తాం. ధరణి మంచి పథకమే కానీ కేసీఆర్ కుటుంబానికి ఆసరాగా మారింది. ధరణిలో మార్పులు చేసి కొనసాగిస్తాం’’ అని చెప్పారు. హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై పార్టీలో చర్చిస్తామని, తెలంగాణకు ఏది మంచో అదే చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.