- గతరాత్రి కాకినాడలో ద్వారంపూడిపై పవన్ ఫైర్
- ద్వారంపూడి దోపిడీ విలువ రూ.15 వేల కోట్లు అంటూ ఆరోపణ
- కాకినాడ మొత్తం బియ్యం ఎగుమతి విలువే అంత ఉండదన్న ద్వారంపూడి
- అంతడబ్బుంటే చంద్రబాబే ఇచ్చే ప్యాకేజీ ఏదో తానే ఇస్తానని వ్యాఖ్యలు
కాకినాడ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
ద్వారంపూడి, ఆయన తండ్రి, సోదరుడు అందరినీ కలిపి ఏకిపారేశారు. బియ్యం ద్వారం ద్వారంపూడి దోపిడీ రూ.15 వేల కోట్లు అని ఆరోపించారు. నీ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అంటూ పవన్ తొడగొట్టారు.
దీనిపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తనవద్ద నిజంగానే రూ.15 వేల కోట్లు ఉండుంటే ఏకంగా పవన్ కల్యాణ్ నే కొనేస్తానని వ్యాఖ్యానించారు. కాకినాడ జోన్ మొత్తం బియ్యం ఎగుమతి విలువే రూ.15 వేల కోట్లు ఉండదని, అలాంటిది తానొక్కడిపైనే పవన్ రూ.15 వేల కోట్లు అని ఎలా ఆరోపణలు చేస్తారని ద్వారంపూడి నిలదీశారు.
“నిజం చెబుతున్నా… నా దగ్గర రూ.15 వేల కోట్లు ఉండుంటే నిన్ను కొనేస్తాను నేను. చంద్రబాబు ఎందుకు…. నీకు నేనే ప్యాకేజీ పెట్టేస్తాను కదా. నీకు కావాల్సింది ప్యాకేజీ… ఓ రెండు సీట్లు… పడేస్తాం” అంటూ ద్వారంపూడి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.