హైదరాబాద్ ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్…!
- బెదిరింపుకు పాల్పడిన నిందితుడి అరెస్ట్
- ఐటీ శాఖ అధికంగా పన్నులు వసూలు చేస్తోందని భావించిన నిందితుడు
- వారి నుండి డబ్బులు వసూలు చేయాలని ఫేక్ కాల్ పథకం
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని ఇన్‌కం ట్యాక్స్ భవన్ లో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ కాల్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి హయత్ నగర్ లో ఉంటున్నాడు. అతను చెడు వ్యసనాలకు బానిసై, అప్పుల పాలయ్యాడు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ అధికంగా పన్నులు వసూలు చేస్తోందని భావించి వారి నుండి ఎలాగైనా డబ్బులు రాబట్టాలని పథకం వేశాడు. ఈ క్రమంలో 11న హయత్ నగర్ లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి డయల్ 100కు ఫోన్ చేసి, ఇన్ కమ్ ట్యాక్స్ టవర్ లో బాంబు పెట్టామని బెదిరించాడు.
ఆ బాంబు పేలకుండా ఉండాలంటే తనకు రూ.1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సమాచారం బాంబు స్క్వాడ్ కు చేరవేయడంతో వారు తనిఖీలు చేశారు. ఉద్యోగులను కార్యాలయం నుండి బయటకు పంపించి పూర్తిగా గాలించారు. ఎక్కడా బాంబు కనిపించలేదు. ఆకతాయి పనిగా భావించిన పోలీసులు దానిని ఫేక్ కాల్ గా తేల్చారు. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాఫ్తు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.