- విపక్షాల సమావేశం కోసం పాట్నా వెళ్లిన రాహుల్, ఖర్గే
- పాట్నాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న అగ్ర నేతలు
- బీహార్ లో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతా గెలిచినట్టేనన్న ఖర్గే
ఈ ఏడాది చివరిలోగా జరగనున్న తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మనం గెలవబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇకపై బీజేపీ ఎక్కడా కనిపించదని జోస్యం చెప్పారు. పేద ప్రజల పక్షాన మనం ఉన్నాం కాబట్టే విజయాన్ని అందుకుంటామని చెప్పారు. బీజేపీ కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల కోసమే పని చేస్తుందని విమర్శించారు. విపక్షాల సమావేశానికి హాజరు కావడానికి రాహుల్ పాట్నాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్వేషం, హింసను వ్యాపింపజేస్తూ దేశాన్ని బీజేపీ ముక్కలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. మనం ప్రేమను, ఐక్యతను వ్యాపింపజేస్తున్నామని చెప్పారు. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఇక్కడకు వచ్చాయని, అందరం కలిసి బీజేపీని ఓడిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో సిద్ధాంతపరమైన యుద్ధం జరుగుతోందని… కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో’ ఐడియాలజీతో ముందుకు వెళ్తుంటే… బీజేపీ, ఆరెస్సెస్ లు ‘భారత్ తోడో’ సిద్ధాంతంతో సాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్ లో ఉందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… మనం బీహార్ లో గెలిస్తే దేశం మొత్తం గెలిచినట్టేనని అన్నారు.