- షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారనే విషయం తనకు తెలియదన్న వీహెచ్
- షర్మిలకు తెలంగాణ కంటే ఏపీలో ఉంటేనే ఉపయోగమని సూచన
- ఇప్పుడు ఎవరినోట విన్నా కాంగ్రెస్ పేరే వినిపిస్తోందని వ్యాఖ్య
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. షర్మిల విషయంలో పార్టీ అధిష్ఠానం సానుకూలంగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తనకు తెలియదని చెప్పారు. తెలంగాణ కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మళ్లీ వేవ్ ప్రారంభమయిందని వీహెచ్ చెప్పారు. ఎవరి నోట విన్నా కాంగ్రెస్ పేరే వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లడం లేదని చెప్పారు. ఎన్నికల కోసమే కేసీఆర్ బీసీ బంధు అంటున్నారని… లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. హెచ్సీఏ భూముల లీజును తీసేని, రాజీవ్ పేరును తొలగించాలని చూస్తున్నారని మండిపడ్డారు.