Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రెండుతరాల జర్నలిస్టుల మద్య పోటి పెట్టడం తగదు…

రెండు తరాల జర్నలిస్టుల మద్య పోటి పెట్టడం తగదు?
జేఎన్‌జే స్థలాలపై సుప్రీం తీర్పు సుధీర్ఘకాలం అమలుకాకపోవటం ఆశ్చర్యంః ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌
వేయి మంది జర్నలిస్టుల అంశాన్ని అయిదు వేల మందితో ఎందుకు ముడి పెడుతుంది
సంఘీభావం తోడుగా ముందుకు సాగాలిః పాశం యాదగిరి.
జేఎన్‌జేకు 70 ఎకరాలు ఇస్తూనే మిగిలిన జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలిః ఆర్టీఏ మాజీ కమిషనర్‌, దిలీప్‌ రెడ్డి

ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ …

హైదరాబాద్‌: జెఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ స్థలాల విషయంలో రెండు తరాల జర్నలిస్టుల మధ్య పోటీ పెట్టడం తగదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి పదినెలలు పూర్తయినా ఈ స్థలాలు స్వాధీనం చేయడంలో ‍ప్రభుత్వం చేస్తున్న జాప్యం పట్ల సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. స్థలాల స్వాధీనం కోసం అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని, ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని జెఎన్‌జె సభ్యులకు సూచించారు.

సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఎన్‌జే సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ పివి రమణరావు అధ్యక్షతన జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యాక్‌ హౌసింగ్‌ సొసైటీ(జేఎన్‌జే మ్యాక్‌ హెచ్‌ఎస్‌) మీడియా సంపాదకులు, ముఖ్యులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తుది తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. సుప్రీం తీర్పును అమలు చేయకుండా కాలయాపన చేయడంద్వారా ప్రభుత్వమే కోర్టు దిక్కరణ పిటీషన్‌ వేసేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పారు. ఆగస్టులోగా తుదినిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ లోగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చించి వారి మద్దతు తీసుకోవాలని, దీనివలన ప్రభుత్వంపై ఒత్తిడి కల్పించేందుకు వీలవుతుందన్నారు. జేఎన్‌జే సొసైటీ మేనేజింగ్‌ కమిటీ ప్రభుత్వానికి చేరువగా వున్నా ఏమాత్రం సభ్యులకు ఉపయోగ పడకపోవడం విచారకరమన్నారు. పేట్‌ బషీరాబాద్‌ స్థలం విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందో చర్చించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. జేఎన్‌జే కి చెందిన 1100మందితో మిగతా 5 వేలమంది సభ్యుల స్థలాలతో పోటీపెట్టడం భావ్యం కాదని అన్నారు. గతంలో ‍ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ నిర్వహించిన సమావేశంలో సైతం జెఎన్‌జె సొసైటీ స్థలాలు మరొకరితో ముడిపెట్టడం తగదని, వారి స్థలాలు వారికే ఇవ్వాలని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వం సొసైటీ సభ్యులు ఇచ్చిన వినతి ప్రతాలకు సమాధానం చెప్పాల్సి వుండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సమస్య జఠిలంగా మారిందన్నారు.

ఇదే సరైన సమయం: దిలీప్‌ రెడ్డి

ఎన్నికల సమయంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్థలాలు సాధించుకోవాలని ఆర్టీఏ మాజీ కమిషనర్‌ దిలీప్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలోనే పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతాయని, ఇందులో భాగంగానే ఈ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య కూడా పరిష్కారమవుతోందని చెప్పారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మూడు దఫాలుగా ఇళ్ళస్థలాలు ఇచ్చిన చరిత్ర వుందని, ప్రస్తుతం జెఎన్‌జె సొసైటీకి సంబంధించి స్థలాల అప్పగింత అంశం సుదీర్ఘంగా కొనసాగుతూనే వుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే కోర్టు కేసులను కాదని ఇచ్చే అవకాశంకూడా వుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదని దిలీప్‌రెడ్డి స్పష్టం చేశారు.

జీవన్మరణ సమస్య: మిట్టపల్లి శ్రీనివాస్‌

మన తెలంగాణ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ మిట్టపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల స్థలాల సమస్య జీవన్మరణ సమస్యగా గుర్తించి ప్రభుత్వం స్పంధించాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో జర్నలిస్టులు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేవిధంగా కార్యక్రమాలు చేపడుతున్నారనీ, దీనిని తప్పుగా భావించకుండా స్థలాలను స్వాధీనం చేయాలన్నారు. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనపర్చాలన్నారు. ఈ స్థలాల స్వాధీనం కోసం అవసరమైతే నిరాహార దీక్షలు నిర్విరామంగా కొనసాగించాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, గాంధేయ విధానంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని సూచించారు.

జర్నలిస్టులకు స్థలాల విషయంలో ఏకాభ్రిపాయం…పాశం యాదగిరి

జర్నలిస్టులకు స్థలాల విషయంలో ఏకాభ్రిపాయం వున్నదని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి స్పష్టం చేశారు. స్థలాల కోసం జర్నస్టులంతా సామ, ధాన భేద దండోపాయాలను అనుసరించాల్సిందేనని ఆయన సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడేలోగా ఇళ్లస్థలాల సాధన ఉద్యమం తీవ్రతరం చేయాలన్నారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని మరింత చైతన్యంగా పోరాటం చేయాలని, అందరి సంఘీభావమే పునాధిగా ఏర్పరచుకుని, ముందుకు సాగాలని యాదగిరి అన్నారు. కలాలను పాశుపతాస్త్రాలుగా సంధించి స్థలాలు సాధించాలని పిలుపునిచ్చారు.

జేఎన్‌జే సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సరిగ్గా పనిచేయకపోవడం వలనే ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడిందని టివి9 అసైన్‌మెంట్‌ ఎడిటర్‌ జగన్మోహనరెడ్డి అన్నారు. సభ్యులే టీమ్‌ జేఎన్‌జేగా ఏర్పడి పోరాటం చేయడంపట్ల ఆయన అభినందనలు తెలిపారు.

జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ప్రధానకార్యదర్శి జి. అంజనేయులు మాట్లాడుతూ హైదరాబాద్‌ జర్నలిస్టులు ఏం పాపం చేశారని, వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్ధం కావడంలేదన్నారు. జేఎన్‌జే సభ్యుల పోరాటం వల్ల ఇళ్ళస్థలాలు సాధించడం సానుకూల పరిస్థితులు ఏర్పడగలవన్నారు.

సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధు మాట్లాడుతూ జేఎన్‌జే సభ్యుల లక్ష్యం ఒక్కటేనని, ఇందులో ఎటువంటి విభేదాలు లేవన్నారు. ఎంతో మంది సభ్యులు చనిపోయారని, వారి ఆత్మలు స్థలాలకోసం ఘోషిస్తున్నాయన్నారు. నాడు 2 లక్షల రూపాయాల విలువైన స్థలాలు అవి నేడు 2 కోట్ల రూపాయలని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు క్షీరాభిషేకం చేసిన సభ్యుల కళ్ళల్లో నేడు రక్తం కన్పిస్తోందన్నారు.

70 ఎకరాల స్థలం మనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా ఎందుకు జాప్యంజరుగుతోందని మేట్రో దినప్రతిక సంపాదకులు దేవరకొండ కాళీదాస్‌ ఆవేదన వ్యక్తం చేసారు.  అధ్యక్షత వహించిన జెఎన్‌జే ఫౌండర్‌ మెంబర్‌ పివి రమణరావు మాట్లాడుతూ ప్రతిసభ్యునికి స్థలాలు వచ్చేలాగా మా పోరాటం వుంటుందని స్పష్టం చేసారు. యూ.ఎన్‌.ఐ. బ్యూరో ఛీఫ్‌ నాగేశ్వరరావు, బిసి టైమ్స్‌ సంపాదకులు సూర్యారావు, సీనియర్‌ జర్నలిస్టులు ఆకుల ఆమరయ్య, మాలకొండయ్య, సుందర్‌శర్మ, కెవిఎస్‌ సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు.
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సంపాదకుల సంతకాలతో కూడిన వినతి పత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని తక్షణమే జెఎన్‌జె సొసైటీకి అప్పగించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అలాగే పేట్‌ బషీరాబాద్‌ స్థలం స్వాధీనం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్దం చేసింది. ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థలకు చెందిన సంపాదకులు మరియు జెఎన్‌జె సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో రచ్చకెక్కిన విభేదాలు.. రెండుగా చీలిపోయిన డైరెక్టర్లు!

Drukpadam

పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన కేసీఆర్, జగన్

Drukpadam

Drukpadam

Leave a Comment