- మదనపల్లెలో చివరి దశకు వచ్చిన సీజన్
- బయటి ప్రాంతాల్లో తగ్గిన దిగుబడి
- డిమాండ్ పెరగడంతో రికార్డు ధరలు
టమాటాల ధర మరింత పెరుగుతోంది. మార్కెట్లో ఇప్పటికే ఆకాశాన్ని అంటిన టమాట ధర.. తాజాగా శనివారం మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె మార్కెట్లో రూ.196 లు పలికింది. నాణ్యమైన టమాటాకు ఈ రేటు పలకగా.. నాణ్యత కాస్త తక్కువగా ఉన్న టమాటాలకు కిలో రూ.140 పలికింది. మార్కెట్ కు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
శనివారం మదనపల్లె మార్కెట్ కు కేవలం 253 టన్నుల టమాటా సరుకు మాత్రమే వచ్చింది. సీజన్ చివరి దశ కావడంతో పాటు మదనపల్లె ప్రాంతంలో తప్ప బయట ప్రాంతాల్లో టమాటా దిగుబడి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో కొరత ఏర్పడిందని వ్యాపారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే టమాటాలకు డిమాండ్ పెరిగి, రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని అధికారులు వివరించారు.