- ఒక్క రూపాయి కమీషన్ తీసుకున్నానని ఒక్కరు చెప్పినా రాజకీయాల నుండి తప్పుకుంటా: గడ్కరీ
- వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశా కానీ కమీషన్ తీసుకోలేదని వ్యాఖ్య
- రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదన్న గడ్కరీ
- యూట్యూబ్ ఛానల్ నుండి మంచి ఆదాయం వస్తుందన్న కేంద్రమంత్రి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క రూపాయి కమీషన్ తీసుకున్నట్లు నిరూపించినా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఇతరుల నుండి తనకు కమీషన్ తీసుకునే అవసరం లేదన్నారు. తాను వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశానని, కానీ తాను కమీషన్ కు దూరంగా ఉన్నట్లు చెప్పారు.
తనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు రూ.3 లక్షలు వస్తాయన్నారు. రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదన్నారు. తనకు ఎవరి నుండి కమీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను హిందీ, మరాఠీ, ఇంగ్లీష్‌లలో చేసిన ప్రసంగాలను యూట్యూబ్ లో చాలామంది చూస్తారన్నారు. అమెరికాలో ఎక్కువమంది తన ప్రసంగాలను చూస్తారన్నారు. తన యూట్యూబ్ ఛానల్ నుండి తనకు మంచి ఆదాయం వస్తుందన్నారు.
తాను చిన్నతనంలో పని చేయడానికి ఆసక్తి చూపించకపోయేవాడినని, అప్పుడే ఒకరి కింద పని చేయకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు తనకు లా కోర్స్ చేయమని చెప్పారని, కానీ తన లక్ష్యాన్ని వారికి చెప్పానన్నారు. కులం, మతం, భాష ఆధారంగా వ్యక్తులు గొప్పవారు కారని, వ్యక్తిత్వం, లక్షణాలు గొప్పతనాన్ని నిర్ణయిస్తాయన్నారు. తాను రాజకీయ నాయకుడినని, తనకు అన్ని వర్గాల వారి ఓట్లు అవసరమే అన్నారు. అందుకే తాను కులం గురించి మాట్లాడనని చెప్పారు. అన్ని కులాల వారు తనకు కుటుంబ సభ్యులేనని, తనకు సోదర సమానులే అన్నారు.