- 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ట్రంప్ పై కేసు
- వాషింగ్టన్ కోర్టులో విచారణకు హాజరైన మాజీ అధ్యక్షుడు
- తాను ఏ తప్పూ చేయలేదని కోర్టుకు తెలిపిన ట్రంప్
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నిర్దోషినని చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని కోర్టుకు తెలిపారు. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ముందంజలో ఉన్న ట్రంప్ ఈ కేసులో వాషింగ్టన్ కోర్టుకు హాజరయ్యారు.
తాను నిర్దోషినని వాంగ్మూలం ఇచ్చిన ఆయన తాను రాజకీయ హింసకు బాధితుడనని అన్నారు. ఈ కేసులో తనపై నేరాభియోగాలు నమోదు చేయడం అమెరికాకు దుర్దినం అని చెప్పారు. ఇది రాజకీయ ప్రత్యర్థిని హింసించడం అని ఆరోపించారు. ట్రంప్ స్టేట్ మెంట్ ను నమోదు చేసుకున్న కోర్టు సమాఖ్య, రాష్ట్ర, స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలనే షరతుపై ఆయనను విడుదల చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.