ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షుడిగా అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి…
ఆర్ఎల్‌డీ చీఫ్‌గా ఉన్న అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
జయంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ
లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన జయంత్
రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడిగా అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి (42) నియమితులయ్యారు. పార్టీకి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అజిత్‌సింగ్ ఈ నెల 6న కరోనాతో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడైన జయంత్ పార్టీ పగ్గాలు చేప్టటారు. పార్టీ జాతీయ కార్యవర్గం నిన్న వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి.. జయంత్ పేరును ప్రతిపాదించగా ఇతర నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. జయంత్ గతంలో లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జయంత్ మాట్లాడుతూ.. తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతకర్తలైన చరణ్ సింగ్, అజిత్ సింగ్ అడుగుజాడలను అనుసరించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
కేంద్రమంత్రిగా పనిచేసిన అజిత్ సింగ్ పలుమార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మాజీ ఎంపీ అయిన జయంత్ చౌదరి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. 2002లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు .