- ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే ఆలోచన అన్న గవర్నర్
- ఆర్టీసీ విలీనం ఉద్యోగుల భావోద్వేగ అంశమని వ్యాఖ్య
- ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్న తమిళిసై
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టీసీ విలీన ప్రక్రియకు అడ్డుపడాలనే ఉద్దేశం తనకు లేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే తన ఆలోచన అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉద్యోగులు కోరుకుంటున్న భావోద్వేగ అంశమన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడంలో అడ్డుపడాలని రాజ్ భవన్ కు లేదన్నారు. ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్నారు.
తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న సీఎస్ వివరణ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తోందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీన ప్రక్రియ సాఫీగా సాగాలన్నారు. ఉద్యోగుల ఆందోళనను ప్రతిపాదిత బిల్లు పూర్తిస్థాయిలో పరిష్కరించేదిగా ఉందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు.
టీఎస్ ఆర్టీసీ బిల్లుపై మరికొన్ని ప్రశ్నలు సంధిస్తూ వివరణ కోరిన గవర్నర్
- ఆర్టీసీకి ఉన్న భూములు, భవనాల వివరాలు ఏమిటి? వాటిని ఏం చేస్తారు?
- డిపోల వారీగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎంత?
- పర్మినెంట్ కాని ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తారా?
- మరోసారి ప్రశ్నలు సంధించిన గవర్నర్
ఆర్టీసీ బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని మరో ఆరు ప్రశ్నలు అడిగారు. ఉద్యోగుల ప్రయోజనం కోసమే తాను మరిన్ని సందేహాలను నివృత్తి చేయాలని అడిగినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై తొలుత ఐదు అంశాలపై ప్రభుత్వం నుండి వివరణ కోరారు. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటామని, సంస్థ యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పోరేషన్ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బందులు ఉండవని, అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని మొదటిసారి వచ్చిన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది.
తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉదయం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్ మరిన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ వివరణ కోరారు. ఆర్టీసీకి ఉన్న భూములు, భవనాల వివరాలు ఏమిటి? వాటిని ఏం చేస్తారు? డిపోల వారీగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎంత? పర్మినెంట్ కాని ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తారా? తదితర ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం నుండి వీటికీ వివరణ వచ్చాక డ్రాఫ్ట్‌ను ఆమోదిస్తానని తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసమే, వారి భవిష్యత్తుకోసమే తాను వివరాలు కోరినట్లు తెలిపారు. కాగా గవర్నర్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలను సిద్ధం చేస్తోంది.