- పెరియకరుప్పరాయన్ ఆలయంలోకి తనను రానివ్వడంలేదన్న మహిళ
- మద్రాస్ హైకోర్టులో పిటిషన్
- మహిళ అంటే మహిళేనన్న న్యాయమూర్తి
- ఇంకా అనాగరిక ఆచారాలు కొనసాగుతున్నాయంటూ విచారం
వితంతువు అనే కారణంతో ఓ మహిళను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోలేరని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. మహిళ అంటే మహిళేనని స్పష్టం చేశారు. వితంతువులు ఆలయాల్లోకి అడుగుపెడితే అపచారం అనే అనాగరిక నమ్మకాలు రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నాయంటూ హైకోర్టు ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.
ఈరోడ్ జిల్లాలోని పెరియకరుప్పరాయన్ ఆలయంలోకి తనను ప్రవేశించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఆలయంలోకి ప్రవేశించే సమయంలో తనకు, తన కుమారుడికి పోలీసు రక్షణ కల్పించాలని తంగమణి అనే మహిళ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 9 నుంచి రెండ్రోజుల పాటు ఆలయంలో జరిగే ఉత్సవాల్లో తాను కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
ఈ పిటిషన్ ను జస్టిన్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అర్థంపర్థంలేని ఇలాంటి మూఢాచారాలను పారదోలాలని సంస్కరణవాదులు ప్రయత్నిస్తుంటే, ఇంకా కొన్ని గ్రామాల్లో ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా ఇలాంటి సిద్ధాంతాలు, నమ్మకాలను ఏర్పరుస్తారని, కానీ భర్తను కోల్పోయిందన్న కారణంతో మహిళలను ఆలయాల్లోకి రానివ్వకపోవడం అంటే వారిని అవమానించడమేనని అన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన మహిళ తంగమణి… పెరియకరుప్పరాయన్ ఆలయ పూజారి భార్యే. భర్త చనిపోవడంతో వైధవ్యం పొందింది. అయితే భర్త లేకపోవడంతో తనను ఆలయంలోకి ప్రవేశించనివ్వకపోవడం పట్ల తంగమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఆమె కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు… ఆలయంలోకి ప్రవేశించే సమయంలో తంగమణికి, ఆమె కుమారుడికి రక్షణ కల్పించాలంటూ సిరువళూరు పోలీసులను ఆదేశించింది. ఆమెను ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.