- వరుసగా నాలుగేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్ గా సేవలందించిన వైవీ సుబ్బారెడ్డి
- ఈ నెల 10న కొత్త ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించనున్న భూమన
- ఇక నుంచి వైసీపీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్న సుబ్బారెడ్డి
టీటీడీ ఛైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి చివరిసారిగా ఈరోజు జరిగే పాలకమండలి సమావేశంలో పాల్గొనబోతున్నారు. రేపటితో ఆయన పదవీకాలం ముగియబోతోంది. కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సుబ్బారెడ్డి వరుసగా రెండు పర్యాయాలు అంటే నాలుగేళ్ల పాటు ఛైర్మన్ గా ఉన్నారు. రేపటి నుంచి ఆయన పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు.
టీటీడీ పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈరోజు జరగనుంది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 29 మంది సభ్యులు హాజరుకానున్నారు. ఈనాటి సమావేశాల్లో పలు కీలక తీర్మానాలపై పాలక మండలి చర్చించనుంది.
ఇంకోవైపు ఈ నెల 10న టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11.44 గంటలకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఛైర్మన్ గా ఆయన రెండో సారి బాధ్యతలను చేపట్టనున్నారు.