- ఆప్కాబ్ వజ్రోత్సవాల్లో జగన్ తో పాటు వేదికను పంచుకున్న జేపీ
- జేపీని పక్కనే కూర్చోబెట్టుకుని ముచ్చటించిన జగన్
- ఇటీవల వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్న జేపీ
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరు ఎవరితో చేతులు కలుపుతారో, ఎవరితో కలిసి పోటీ చేస్తారో అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ పరిణామం సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవల విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరయ్యారు.
వేదిక మీదకు జేపీ వస్తున్న సమయంలో జగన్ లేచి నిలబడి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. తన పక్కనే ఉన్న సీట్ లో కూర్చోబెట్టారు. జేపీతో చాలా కులాసాగా ముచ్చటించారు. దీంతో, సరికొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది. వైసీపీ మద్దతుతో ఎంపీగా జేపీ పోటీ చేస్తారని లేదా వైసీపీలో లోక్ సత్తాను విలీనం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు, గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను జేపీ ప్రశంసిస్తుండటం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. వాలంటీర్ వ్యవస్థను కూడా జేపీ ప్రశంసించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో, వైసీపీలో జేపీ చేరబోతున్నారనే ప్రచారం పట్ల లోక్ సత్తా ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పారు. గతంలో ఆప్కాబ్ ఛైర్మన్ గా జేపీ పని చేశారని… ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకే వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారని తెలిపారు.