పవన్ ఎలాంటి వ్యక్తి అంటే…!: రేణూ దేశాయ్
- పవన్ తన పట్ల వ్యవహరించిన తీరు నూటికి నూరుశాతం తప్పేనన్న రేణూ దేశాయ్
- తమ పిల్లలకు రాజకీయాలతో సంబంధమేంటన్న రేణూ దేశాయ్
- రాజకీయ రంగంలో పవన్ కు తన మద్దతు ఉంటుందని వెల్లడి
బ్రో చిత్రంలో కొన్ని సీన్లు రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో, తన బిడ్డలను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన మాజీ భర్త పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి స్పందించారు.
గతంలో పవన్ తన పట్ల వ్యవహరించిన తీరు నూటికి నూరుశాతం తప్పేనని స్పష్టం చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదని, దానిపై ఇంకెలాంటి చర్చ అవసరంలేదని ఉద్ఘాటించారు. గతంలో దీనిపై ఒక ట్వీట్ కూడా చేశానని తెలిపారు.
కానీ పవన్ డబ్బు మనస్తత్వం కలిగిన వ్యక్తి మాత్రం కాదని అన్నారు. తనకు తెలిసినంత వరకు పవన్ కు డబ్బు అంటే ఆసక్తి లేదని వెల్లడించారు.
పవన్ లోని రాజకీయ నేత, సామాజిక సంస్కర్తకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. పవన్ చాలా అరుదైన మనిషి అని, సమాజం సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
“మొదటి నుంచీ నా వ్యక్తిగత బాధ, సమస్యలను పక్కనబెట్టి ఆయనకు రాజకీయంగా సపోర్ట్ చేశాను… చేస్తాను. పవన్ కల్యాణ్ ఒక విజయవంతమైన నటుడు. కానీ సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. వ్యక్తిగత జీవితంలో నేను నష్టపోయి ఉండొచ్చు… కానీ రాజకీయంగా అలాంటి నేతనే నేను కోరుకుంటాను. ఇతరులు కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి, ఆయన ఏ రాజకీయ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారన్నదానిపై దృష్టి పెట్టండి.
పవన్ తన కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలేసి సమాజం కోసం పాటుపడుతున్నారు. ఆయనకు అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడు పెళ్లిళ్లు అంటూ ప్రతిసారీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని తెరపైకి తీసుకురావొద్దు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి” అంటూ రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు.