Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

మోడీ ప్రభుత్వంపై వీగిపోయిన అవిశ్వాసం …

ఏపీ, బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరు: ప్రధాని మోదీ

  • పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం
  • ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు
  • కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన వైనం
  • మిమ్మల్నిగెలిపించకపోవడం ప్రజల తప్పు కాదు… మీరు చేసుకున్న కర్మ అంటూ వ్యాఖ్యలు

మోడీ ప్రభుత్వం పై కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది …ఎలాంటి ఓటింగ్ చేపట్టకుండానే ప్రతిపక్షాలు ప్రధాని ప్రసంగిస్తుండగానే వాక్ అవుట్ చేశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా ముజు వాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు .. అంతకు ముందు మోడీ విపక్షాలపై లోకసభలో విమర్శలు గుప్పించారు . కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అవిశ్వాసం తీర్మానం పై స్వాగతం చెపుతూనే ఆదేవుడే విపక్షాలకు చెప్పి అవిశ్వాసం పెట్టించారని అన్నారు .అసలు దేశప్రజలకు కాంగ్రెస్ పై విశ్వాసం లేదని ఎప్పుడో చెప్పారని ఆయన వారికీ జ్ఞానోదయం కాలేదని అన్నారు .అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పై నో కాన్ఫడాన్సు చెపుతూ వచ్చిన విషయాన్నీ ఆయన సభలో చెపుతూ సెటైర్లు వేశారు ..

పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ అనేది ముగిసిన అధ్యాయం అని, ఇప్పుడు ఇండియా పేరిట కూటమి ఏర్పాటు చేసుకోవడం మూలనబడ్డ బండికి రంగు వేయడం వంటిదేనని ఎద్దేవా చేశారు. ఎన్ని రంగులు వేసినా, పైపూతలు పూసినా బండి నడవదు కదా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

మిమ్మల్ని గెలిపించకపోవడం ప్రజల తప్పు కాదు… మీరు చేసుకున్న కర్మ అని విమర్శించారు. తమిళనాడు, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్, తమిళనాడు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ గెలిచిందే లేదు… వాళ్లకు అక్కడ ఓటమి తప్ప మరో ఫలితం కనిపించడంలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరని హేళన చేశారు. ఇక, ఇటీవల ఇండియా కూటమి ఏర్పాటుపైనా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

“ఇటీవల మీరు బెంగళూరులో యూపీఏకి కర్మకాండలు నిర్వహించారు. కర్మకాండలను కూడా మీరు పండుగలా చేసుకున్నారు. NDAకి రెండు Iలు అదనంగా చేర్చి INDIA పేరుతో మళ్లీ 16 పార్టీలే ఏకతాటిపైకి వచ్చారు. INDIA లోని ఒక I 16 పార్టీల అహంకారానికి సూచిక. మరో I ఒక ప్రధాన కుటుంబం అహంకారానికి సూచిక. కొత్తగా ఎన్ని జట్లు కట్టినా ఓటమి తప్పదు… ఇది ఖాయం చేసుకోండి. మీ కూటమిలోనే భారత్ అస్తిత్వాన్ని ప్రశ్నించేవాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లతో బండి కదులుతుందా? 

ఒక పెద్ద పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించారు… వారి పని మాత్రం ఎక్కడా కనిపించదు. ఆసుపత్రుల పేర్లు, క్రీడల అవార్డుల పేర్లు, రహదారుల పేర్లు అన్నింటికీ వారి పేర్లే పెట్టుకుంటారు. ఆసుపత్రికి వారి పేరు ఉంటుంది కానీ చికిత్స మాత్రం దొరకదు. రహదారులకు పేర్లు పెట్టుకుంటారు కానీ, కొత్తవాటి నిర్మాణం గురించి ఆలోచించరు. వారి పేరుతో అవార్డులు ఉంటాయి కానీ, క్రీడాకారులకు మాత్రం ప్రోత్సాహం ఉండదు. 

ఆ కుటుంబ వ్యవహార శైలి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది. ఆ కుటుంబం గురించి, వారి అహంకారం గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంది. మూడు రంగుల జాతీయ జెండాను కాంగ్రెస్ తన జెండాగా మార్చుకుంది. ఇతరుల కష్టాలను, విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. 1920 నుంచి జరుగుతోంది ఇదే. ఎన్నికల గుర్తులను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చింది. 

ఇది ఇండియా కూటమి కాదు, అహంకార కూటమి. ఆ కూటమిలో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి కావాలనుకునేవారే. 21 రాష్ట్రాల్లో ఈ కూటమిలోని పార్టీల మధ్య సంబంధాలు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి. అక్కడ కొట్లాడుకుంటారు… ఇక్కడికి వచ్చి కలిసిపోతారు. పశ్చిమ బెంగాల్, కేరళలో కాంగ్రెస్ వర్గీయులు, కమ్యూనిస్టులు పరస్పరం దాడులు చేసుకుంటారు… ఇక్కడికి వచ్చి చేతులు కలుపుతారు. 

మీ చర్యలను, మీ చేష్టలను దేశమంతా గమనిస్తోంది. మీరు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారు” అంటూ ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగింది.

2028లోనూ మా ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం పెడతాయి: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీకి అంతర్జాతీయ ఆర్థిక విధానం తెలియదని, ఆ పార్టీకి ఓ విజన్ లేదని, నిజాయతీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో భారత్ పేదరికంలో మగ్గిందన్నారు. 2028లోను తమపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడతాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారత వ్యాక్సిన్‌పై, భారత ప్రజల‌పై, భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం లేవన్నారు. విపక్షాలకు పాకిస్థాన్‌పై ప్రేమ కనిపిస్తోందని, ఆ దేశం చెప్పిందే నమ్ముతోందన్నారు. అందుకే పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటే కాంగ్రెస్ సైన్యాన్ని నమ్మలేదన్నారు. అందుకే తమిళనాడు ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పారన్నారు. అలాగే బెంగాల్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్.. ఇలా పలు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పాయన్నారు. క్రమంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. మేకిన్ ఇండియా అంటే కూడా ఎగతాళి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అహంకారంతో కళ్లు మూసుకుపోయాయన్నారు.

విపక్షాలు ఇండియాను.. I.N.D.I.A. అంటూ ముక్కలు చేశాయన్నారు. విపక్షాలు NDAకు  రెండు Iలు చేర్చి I.N.D.I.A.గా మార్చాయని, మొదటి I.. 26 పార్టీల అహంకారానికి, రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతి పథకం వెనుక కాంగ్రెస్ ఓ కుటుంబం పేరే చేర్చిందన్నారు. విపక్షాలలో ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి కావాలని ఉందన్నారు. కానీ అక్కడ స్కీంలకు బదులు స్కామ్‌లు ఉంటాయన్నారు. తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి గాంధీ పేరును వినియోగించుకుందని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అవినీతి కూటమి అన్నారు. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన అంటే ఇష్టమన్నారు.

 నో కాన్ఫిడెన్స్ మోషన్ నో బాల్‌గా మిగిలిపోయింది: ప్రధాని మోదీ

అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలు మూడ్రోజులుగా ఫీల్డింగ్ చేస్తుంటే తమ వైపు నుండి ఫోర్లు, సిక్సులు పడ్డాయని, అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… అవిశ్వాసం పెట్టాలని దేవుడే విపక్షాలకు చెప్పాడని, ఇలా పెట్టినందుకు మోదీ వారికి ధన్యవాదాలు చెప్పారు. 

విపక్షాల అవిశ్వాసం తమకు శుభసూచకమన్నారు. 2018లోను అవిశ్వాస తీర్మానం పెట్టారని, కానీ ప్రతిపక్షాలకు వారికి ఉన్న సభ్యుల ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ అవిశ్వాసం తమపై కాదని, విపక్షాల పైనే అన్నారు. 2024లో ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, కానీ విపక్షాలకు మాత్రం అధికార దాహం పెరిగిందన్నారు. పేదల భవిష్యత్తు కంటే విపక్షాలకు అధికారమే ముఖ్యమని విమర్శించారు.

మూడురోజులుగా అవిశ్వాసంపై జరిగిన చర్చ ఆశ్చర్యం కలిగించిందని, విపక్షాలు ఫీల్డింగ్ చేస్తుంటే, తమ వైపు నుండి ఫోర్లు, సిక్స్‌లు పడ్డాయన్నారు. అయిదేళ్లు సమయం ఇచ్చినా విపక్షాలు తమపై సిద్ధం కాలేదని ఎద్దేవా చేశారు. ఈ కాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో విఫలమైనట్లు చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని ఆరోపించారు. కానీ వారు ప్రవేశపెట్టిన నో కాన్ఫిడెన్స్ నో బాల్ గా మిగిలిపోయిందన్నారు. చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా విన్నదన్నారు. అధిర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదో తనకు అర్థం కాలేదని, బహుశా కోల్ కతా నుండి ఫోన్ వచ్చినట్లుందని చమత్కరించారు.

మా పాలన ఎలాంటి కుంభకోణాలు లేకుండా స్కామ్ ఫ్రీగా భారత్ ముందు నిలిచిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయన్నారు. తాము భారత్ ప్రతిష్ఠను విశ్వాంతరం చేశామన్నారు. కానీ విపక్షాలు భారత ప్రతిష్ఠను విదేశాల్లో మసకబార్చే ప్రయత్నం చేశాయన్నారు. మా పాలనలో దేశం ఎంతగా బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం అన్నారు. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించిందన్నారు. మా దృష్టి అంతా అభివృద్ధి పైనే అన్నారు. ప్రపంచం నలుమూలలా భారత్‌కు విస్తార అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, హెచ్ఏఎల్ పని అయిపోయిందని అసత్య ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ బాగుందని, హెచ్ఏఎల్ దూసుకుపోతోందన్నారు. ఎల్ఐసీ పైనా అసత్య ప్రచారం చేశారన్నారు.

విపక్షాల వెనుక రహస్య శక్తులు ఉన్నాయన్నారు. అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో జీర్ణించుకుపోయిందన్నారు. మూడు రోజులుగా విపక్షాలు డిక్షనరీని తిప్పాయని, తమను అనరాని మాటలతో ఇప్పుడు వారి ఆత్మ శాంతించి ఉంటుందన్నారు. భారత్ లో జరిగే మంచి పనులు చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.

Related posts

 పీవోకే కోసం 24 సీట్లు రిజర్వ్ చేశాం… కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Ram Narayana

డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు… మహువా మోయిత్రాపై ఆరోపణల మీద తృణమూల్ మౌనం

Ram Narayana

బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, ఇక్కడి కాంగీ, తెలంగాణ కేడీ అవిశ్వాసం ఎందుకు పెట్టారు?: లోక్ సభలో ఊగిపోయిన బండి సంజయ్

Ram Narayana

Leave a Comment