గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం.. స్వాతంత్ర వేడుకల్లో జగన్
-విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు
-సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన జగన్
-సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేసుకున్న సీఎం
-పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడం కూడా అంటరానితనమేనన్న జగన్
-45 వేల బడుల రూపురేఖలు మార్చామని స్పష్టీకరణ
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. అధికారంలోకి వచ్చిన 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చినట్టు చెప్పారు.
గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. పౌర సేవల్ని ఇంటింటికీ తీసుకెళ్లినట్టు వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ మన జాతీయ జెండా ఎగురుతోందని పేర్కొన్నారు. ఈ 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతగానో పురోభివృద్ధి సాధించిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను మహిళల పేరున ఇస్తున్నట్టు తెలిపారు. రూ. 2.31 లక్షల కోట్లను నేరుగా ప్రజలకు అందించినట్టు వివరించారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని చెప్పారు.
పోలవరాన్ని 2025కు పూర్తిచేస్తాం
సామాజిక న్యాయం నినాదంగా మిగిలిపోలేదని, దానిని అమలు చేసి చూపించామని జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని, వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని తెలిపారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి.. 2025 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
98.5 శాతం వాగ్దానాలు నెరవేర్చాం
మూతబడిన చిత్తూరు డైయిరీని తిరిగి తెరిచినట్టు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని పేర్కొన్నారు. పేదలు గెలిచే వరకు, వారి బతుకులు బాగుపడే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తామిచ్చిన వాగ్దానాల్లో 98.5 శాతం అమలు చేశామని తెలిపారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొచ్చి అన్ని హామీలను అమలు చేసినట్టు వివరించారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని, నాడు-నేడుతో 45 వేల బడుల రూపురేఖలు మార్చామని జగన్ వివరించారు.