-మధ్యతరగతి సొంతింటి కల తీరేలా త్వరలో కొత్త పథకం.. ఎర్రకోట వేదికగా మోదీ ప్రకటన
-ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగం
-మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమయ్యేందుకు ఓ కొత్త పథకం తీసుకొస్తామని వెల్లడి
-లక్షల రూపాయల మేర లాభం చేకూరుతుందని ప్రకటన
-పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్న మోదీ
-సంప్రదాయ కార్మికులకు ‘విశ్వకర్మ యోజన’ పథకం ప్రకటన
-విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 17న ప్రకటన
-స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీ మేస్త్రీల కోసం ‘విశ్వకర్మ యోజన’
-ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్ల కేటాయింపు
-వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం అగ్రగామిగా నిలుస్తుందన్న మోదీ
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మధ్యతరగతి ప్రజల సొంతింటి కల తీరే ఓ కొత్త పథకం గురించి ప్రస్తావించారు. ‘‘కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవ్వరి తరమూ కాదు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి కొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడతాం. పట్టణ ప్రాంతాల దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకం పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని ప్రధాని పేర్కొన్నారు, దీంతో, ఈ కొత్త పథకం ఏమై ఉంటుందా? అని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
సంప్రదాయ కార్మికులకు ‘విశ్వకర్మ యోజన’ పథకం
స్వాతంత్య్ర దినోత్సవాన సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభవార్త చెప్పారు. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఎర్రకోటపై జాతినుద్దేశించి మాట్లాడుతూ.. స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీమేస్తీల కోసం వచ్చే మరికొన్ని నెలలలో విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీరిలో చాలావరకు ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారని తెలిపారు.
సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామన్న ప్రధాని మోదీ.. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవాన దేశం సాధించిన విజయాలను ఎర్రకోట నుంచి వివరిస్తానని చెప్పారు.
సుప్రీంకోర్టుపై ప్రధాని ప్రశంసలు.. రెండు చేతులతో నమస్కరించిన చీఫ్ జస్టిస్
రెండు చేతులతో ప్రతి నమస్కారం చేసిన చీఫ్ జస్టిస్
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ రెండు చేతులతో నమస్కరించిన అరుదైన దృశ్యం స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా చోటు చేసుకుంది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రాంతీయ భాషల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. స్థానిక భాషల్లోనే తీర్పులను ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాతృభాషల ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు.
‘‘సుప్రీంకోర్టుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీర్పులోని ముఖ్య భాగం అంతా కూడా మాతృభాషలోనే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. మాతృభాషల ప్రాధాన్యాన్ని సుప్రీంకోర్టు పెంచుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన అతిథుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ప్రధాని సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పడంతో.. జస్టిస్ చంద్రచూడ్ సైతం రెండు చేతులను పైకి ఎత్తి ప్రతి నమస్కారం చేశారు. అక్కడున్న వారంతా ప్రధాని ప్రసంగానికి చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కోర్టులు స్థానిక భాషల్లోనే తీర్పులు జారీ చేయాలంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తరచూ చెబుతుంటారు. ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఒక దానిని హిందీ, తమిళం, గుజరాతీ, ఒడియా భాషల్లోకి అనువదించారు. తీర్పులను అనువాదం చేయడం వల్ల ప్రజలు వాటిని అర్థం చేసుకోగలరన్నది చీఫ్ జస్టిస్ అభిప్రాయంగా ఉంది. న్యాయ పరమైన పదాలతో కూడిన ఇంగ్లిష్ భాషను 99.9 శాతం ప్రజలు అర్థం చేసుకోలేరని ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ పేర్కొనడం గమనార్హం. అందుకే తీర్పులను ప్రాంతీయ భాషల్లో అనువదించాలని నిర్ణయించినట్టు చెప్పారు.