జగన్ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతారు.. జోస్యం చెప్పిన తులసిరెడ్డి
- ఇటీవల జరిగిన మండలి, వార్డు ఎన్నికలే అందుకు ఉదాహరణ అన్న తులసిరెడ్డి
- తనది పేదల పార్టీ అని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా
- వైసీపీని ఓడిస్తే రాష్ట్రం, బీజేపీని ఓడిస్తే దేశం సుభిక్షంగా ఉంటాయన్న కాంగ్రెస్ నేత
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పరాభవం తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగన్ తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవడం పక్కా అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మండలి, వార్డు ఎన్నికలే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. వైసీపీని ఓడిస్తే రాష్ట్రం, బీజేపీని ఓడిస్తే దేశం సుభిక్షంగా ఉంటాయని తులసిరెడ్డి తెలిపారు.
కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి.. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ ముఖ్యమంత్రి కాకముందే దేశంలోని ముఖ్యమంత్రులందరి కంటే ధనవంతుడని అన్నారు. తనకు రూ. 370 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో జగన్ పేర్కొన్నారన్నారు. వైసీపీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా కోటీశ్వరులేనని, వారిలో నలుగురు బిలియనీర్లు కూడా ఉన్నారని తెలిపారు. అయినా, తనది పేదల పార్టీ అని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇసుక సహా ప్రకృతి వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయని విమర్శించారు. చెల్లెళ్లు షర్మిల, సునీతకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు కృషి చేస్తున్నానంటే ఎలా నమ్మాలని తులసిరెడ్డి ప్రశ్నించారు.