తెలంగాణలో మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా
- రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల ఏర్పాటుకు లక్కీ డ్రా
- వచ్చిన దరఖాస్తులు 1,31,490
- 34 ఎక్సైజ్ జిల్లాల్లో డ్రా కోసం ప్రత్యేక కేంద్రాలు
- డ్రాలో గెలుపొందినవారికి డిసెంబరు 1 నుంచి మద్యం విక్రయాలకు అనుమతి
తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి అధికారులు నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. 2023-25కు సంబంధించి మొత్తం 2,620 మద్యం దుకాణాల కేటాయింపుల కోసం నిర్వహించనున్న ఈ డ్రా కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తుదారుల సమక్షంలో ఉదయం 10.30 గంటలకు దుకాణాల వారీగా డ్రా తీస్తారు. డ్రాలో గెలుపొందిన వారు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్ రుసుములో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగించేందుకు అనుమతిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వీటి కోసం ఏకంగా 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల్లో 18,091 దరఖాస్తులు రాగా, ఈసారి డబుల్‌కు మించి 42,596 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.