ఖమ్మం జిల్లాలో మదన్ లాల్ ఇన్ రాములు నాయక్ అవుట్ …
ఆయనకు తప్ప … అందరికి ఓకే
ఉమ్మడి జిల్లాలో బి.ఆర్.ఎస్. అభ్యర్థులు
కిం కర్తవ్యం .. తుమ్మల, జలగం, గడల, రాములు నాయక్ ?
అసంతృప్తుల పరిస్థితి ఏంటి?
గులాబీ బాస్ కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా తన టీం ను ప్రకటించారు. రానున్న అసెoబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను రంగంలోకి దింపారు. 100 రోజుల ముందే ఎన్నికల నగరా మోగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ..
ఖమ్మం ….. పువ్వాడ అజయ్ కుమార్,
సత్తుపల్లి…. సండ్ర వెంకట వీరయ్య,
మధిర… లింగాల కమల్ రాజు,
వైరా… బానోత్ మదన్ లాల్,
పాలేరు…. కందాళ ఉపేందర్ రెడ్డి,
పినపాక … రేగా కాంతారావు,
అశ్వరావుపేట ..మెచ్చా నాగేశ్వరరావు ,
కొత్తగూడెం… వనమా వెంకటేశ్వరరావు,
ఇల్లందు … బానోత్ హరిప్రియ నాయక్,
భద్రాచలం … తెల్లం వెంకట్రావ్ పేర్లు ప్రకటించారు.
ఈ అభ్యర్థుల అనునయులు జోష్ లో ఉన్నారు. సంబరాలు జరుపుకున్నారు. ఇల్లందు, భద్రాచలం అభ్యర్దులను నియోజకవర్గంలోని పలువురు నేతలు వ్యతిరేకించిన అధికార పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు టికెట్ ఇచ్చారు. 2018లో స్వతంత్ర ఎమ్మెల్యే గా గెలిచిన రాములు నాయక్ బి.ఆర్.ఎస్.లో చేరారు. పని తీరు, ప్రజల ఆదరణ నామ మాత్రంగా ఉండడం.. ఆయన కంటే మదన్ లాల్ కు సర్వే ఆదరణ ఎక్కువ ఉన్నట్లు భావించి టికెట్ వరించినట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, వైరా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కొత్తగూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ , రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు టికెట్ ఆశించారు. ఇప్పుడు వారు ఎటువంటి స్టెప్ తీసుకుంటారని ఉమ్మడి ఖమ్మం ప్రజలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అధికార పార్టీతో పొత్తు కోసం ఎదురు చూస్తున్న కమ్యూనిస్టుల ఆశలు కారు పార్టీ అభ్యర్థుల ప్రకటనతో గల్లంతులయ్యాయి. బి.ఆర్.ఎస్. తో కలిసి పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు ఎన్నికల బరిలో దిగేందుకు వ్యూహ రచన చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంగళవారం రెండు పార్టీ లు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. వారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. కమ్యూనిస్టుల ఖిల్లా గా పేరు ఉన్న ఉమ్మడి ఖమ్మంలో సిపిఐ , సీపీఎం నేతలు ఎన్నికల సమరానికి ఎలా సిద్ధం అవుతారనే అంశం సర్వత్రా చర్చ జరుగుతోంది.