- రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా కేసీఆర్ తన ఓటమిని ముందే అంగీకరించారన్న కాంగ్రెస్ నేత
- మేనిఫెస్టో హామీలు అమలు చేయని కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- టికెట్ల కోసం కొట్లాట కాంగ్రెస్‌లోని అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్న మాజీ మంత్రి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని ముందే అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయని కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి నిన్న గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుమల కొండపై మాట్లాడిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌రెడ్డి తమ దెబ్బ ఎలా ఉంటుందో కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా చూపించాలని అన్నారు. టికెట్ల కోసం తాము కొట్టుకోవడం పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం పెరిగిపోయాయని, తెలంగాణ అమరవీరుల రక్తపు కూడును కేసీఆర్ కుటుంబం తింటోందని జూపల్లి ఆరోపించారు. వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయమని అన్నారు.