బీఆర్ యస్ తప్పిదం…అనివార్యంగా కాంగ్రెసులోకి తుమ్మల…? పాలేరు నుంచే పోటీ …!
వేలాదిమంది అభిమానులమధ్య ఖమ్మం జిల్లాలోకి ప్రవేశం
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోటీలో ఉంటా అన్న తుమ్మల …
గోదావరి నీళ్లతో జిల్లా ప్రజల కాళ్లు కడుగుతానని ప్రతిజ్ఞ ..
నా జీవిత ఆశయం అదొక్కటే వెల్లడి …
తుమ్మల విషయంలో బీఆర్ యస్ తప్పిదం చేసిందా …? అంటే నూటికి నూరు పాళ్ళు చేసింది అంటున్నారు రాజకీయపరిశీలకులు … జిల్లాలో అన్ని ప్రాంతాలకు , అన్ని వర్గాలకు అభిమాననాయకుడుగా ఉన్న తుమ్మలను కేసీఆర్ దూరం పెట్టడం తెలివి తక్కువ తనమే అంటున్నారు పరిశీలకులు .. జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉంటూ సీనియర్ రాజకీయ నేతగా సుదీర్ఘకాలం మంత్రిగా చేసి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన తుమ్మల మాట పట్టించుకోకపోవడం ,చిన్నచూపు చూడటంతో ఆయన హర్ట్ అయ్యారు . దీంతో అనివార్యంగా ఆయన్ను పార్టీ మారే విధంగా చేశారనేది నిర్వివాదాశం … శుక్రవారం వేలాదిమంది అభిమానుల మధ్య ఆయన ఖమ్మం సరిహద్దుల్లోకి ప్రవేశించారు …ఒక్కసారిగా తుమ్మల రాకతో జనం కేరింతలు కొట్టారు …జై తుమ్మల అంటూ నినదించారు …వేలాది వాహనాలు వెంట రాగా అడుగడుగునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు … తుమ్మల అభిమానుల సత్తా అంటే ఏమిటో చూపించారు …తుమ్మలను విస్మరిస్తే జరిగే పరిణామాలు ఇలా ఉంటాయనే హెచ్చరికను పంపించారు ..
జిల్లాలో ఒక్క వైరా అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు తప్ప అందరికి టికెట్ కేటాయించారు కేసీఆర్ …ఒకవేళ తుమ్మలను పార్టీలోనే కొనసాగేలా చేయాలంటే కేసీఆర్ చేతిలో పని…. ఆయన దగ్గర అనేక అస్త్రాలు ఉన్నాయి అవకాశాలను కూడా ఆయనకు అందకుండా చేశారు . అంటే ఆయన్ను వదిలించుకోవాలని ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు … తుమ్మల లాంటి సీనియర్ నేత ఉంటె తమపప్పులు ఉడకవని కొందరి భావన అయి ఉండవచ్చు . ఒకప్పుడు కావాలని తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ కు తుమ్మల ఇప్పుడు చేదు ఎందుకు అయ్యారనేది బ్రహ్మరహస్యం … వీరికి ఎక్కడ చెడింది అనేది పరిశీలిస్తే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని చర్చనీయాంశం కాగా … మరికొన్ని లేనివి …
2018 మంత్రిగా ఉన్న తుమ్మల పాలేరులో పోటీచేసి తన సీటు ఓడిపోవడంతో కేసీఆర్ కు కోపం తెప్పించి ఉండవచ్చు …? అయితే దానికి కారణాలు కూడా కేసీఆర్ కు తెలుసు … వాటిపై సమీక్షా జరగాలి …అవసరమైతే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలి …కానీ ఆదిపూర్తిగా జరగలేదు ..పైగా కొందరికి పదవులు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు …నింద మాత్రం ఒక్కడి మీద తోశారనే అభిప్రాయాలు ఉన్నాయి … 40 సంవత్సరాలుగా తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న సౌధాన్ని కూల్చేపని చేసి తుమ్మల ఇమేజిని ఒక్కసారిగా దెబ్బతీసే ప్రయత్నం జరిగింది…కానీ జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి, ముందు చూపు వల్ల ఆయన్ను డ్యామేజీ చేయలేక పోయారు … ఓడిపోయిన కుంగిపోకుండా నిత్యం ప్రజల్లో ఉన్నారు …దీంతో ఆయనపట్ల సానుభూతి పెరిగింది…తుమ్మలకు జరిగిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు ..తిరగబడుతున్నారు …బీఆర్ యస్ , కేసీఆర్ పై ఆగ్రహం ప్రకటిస్తున్నారు ….ఆయన సేవలు ఉపయోగించుకోవడంలో కేసీఆర్ వైఫల్యం చెందారని అంటున్నారు . తుమ్మల ప్రభావం ఒక్క పాలేరుకో ,లేక ఖమ్మంనికో పరిమితం కాదు …ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉంటుంది… ఇప్పటికే పొంగులేటి బీఆర్ యస్ ను వీడి పోవడం మైనస్ కాగా తుమ్మల ప్రభావం పారింతగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు …
ఆయన ఏపార్టీలోకి వెళ్తారనేది నేడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది . ఆయనకు ఉన్నది రెండు మార్గాలు ఒకటి బీజేపీలో చేరడమా…? రెండు కాంగ్రెస్ లోకి వెళ్లడమా..?అనేది … ఆయన అనుయాయిలు మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్లాలని వత్తిడి తెస్తున్నారు ..కచ్చితంగా పాలేరు నుంచి పోటీచేసి సత్తా చాటాలని అంటున్నారు … ఆయనకూడా నామదిలో అనేక విషయాలు ఉన్నప్పటికీ , ప్రజల అభిమానం ప్రేమ చూసిన తర్వాత కచ్చితంగా పోటీచేస్తా …అదికూడా పాలేరు నుంచే చేస్తానని కుండబద్దలు కొట్టారు… గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతా అని ప్రజల హర్షద్వానాలమధ్య ప్రకటించారు . తన జీవిత ఆశయం అదొక్కటే అన్నారు … ఇక ఆయన పోటీచేసే విషయంలో శషభిషలు లేవు …పాలేరు బరిలో పోటీ ఖాయమైంది…తనకు పాలేరు ప్రజల మీద విశ్వాసం ఉందని అందువల్ల వారి తీర్పు కోసం మళ్ళీ వెళతానని అంటున్నారు ..
ఉమ్మడి రాష్ట్రంలో బలమైన సామాజికవర్గానికి చెందిన తుమ్మలకు టికెట్ నిరాకరించడంపై ఆ వర్గం కూడా అసంతృప్తిగా ఉంది . ఆ సామాజికవర్గంలో ఆయన పెద్దకాపు లాంటివాడు తుమ్మల మాట అంటే ఒక విలువ ఉంటుంది…అలాంటి నేతను విస్మరించడమంటే ఆవర్గం వారిని దూరం చేసుకోవడమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి …ఇప్పటివరకు కాస్తో కూస్తో కేసీఆర్ పై సానుకూలంగా ఉన్న ఆవర్గంలో సంతృప్తి లేదు …పైగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు …బీఆర్ యస్ కు రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇది కూడా ఒక కారణం అవుతుందనడంలో సందేహంలేదు….