- ఆదివారం బీడ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్
- ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే బీజేపీ-ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపామని వెల్లడి
- అన్ని కులాలు, మతాల వారిని రక్షించడం తమ బాధ్యత అని వ్యాఖ్య
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే తన వర్గం బీజీపీ-ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేతులు కలిపిందన్నారు. బీడ్‌జిల్లాలో ఆదివారం ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మేము మహాయుతి కూటమిలో చేరాము. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మహాయుతి కూటమిలో మేము చేరినప్పటికీ అన్ని మతాలు, కులాల వారిని సంరక్షించడమే మా బాధ్యత’’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు.
తాము రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నామని అజిత్ పవార్ తెలిపారు. పొలంలో నీళ్లు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. తాను నీటివనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ విషయంలో చాలా కృషి చేశానని గుర్తు చేశారు. ఎన్సీపీలో చీలిక లేదంటూ పార్టీ అధినేత శరద్ పవార్ పేర్కొన్న తరుణంలో అజిత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.