బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే మాట్లాడుతుండగా వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
- తెల్కపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
- కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తానని హెచ్చరిక
నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తానని వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో ‘పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న’ పాదయాత్రలో మాట్లాడుతూ… తన జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తానన్నారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చేయి ఊడిపోతుందన్నారు. నాతో పెట్టుకుంటారా? నాతో పెట్టుకుంటే మీకే మైనస్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెల్కపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న మర్రి మాట్లాడుతుండగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన కోపంతో ఊగిపోయారు.