- పిలిభిత్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో వరుణ్‌గాంధీ వ్యాఖ్యలు
- ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మోగిన సాధువు సెల్‌ఫోన్
- ఆయననేమీ అనొద్దని కార్యకర్తలకు సూచన
- ఆ సాధువు సీఎం అయితే మన పరిస్థితి తారుమారవుతుందని జోక్
- యూపీ సీఎం యోగినే అన్నారంటున్న నెటిజన్లు
సొంతపార్టీపైనే బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సెటైర్ వేశారు. సాధువులను ఎవరూ ఏమీ అనొద్దని, ఎందుకంటే వారెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఏం చెప్పగలమని పరోక్షంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన నియోజకవర్గమైన పిలిభిత్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతున్న సమయంలో ఓ సాధువు ఫోన్ రింగయింది. ఆయన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయమని కార్యకర్తలు ఎక్కడ చెబుతారోనని ముందే స్పందించిన వరుణ్.. ఆ సాధువును ఎవరూ ఏమీ అనొద్దని, సాధువులు ఎప్పుడు సీఎం అవుతారో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు.
‘‘దయచేసి ఆయనను ఎవరూ ఏమీ అనొద్దు. మాట్లాడుకోనీయండి. ‘మహారాజ్ జీ’ ఎప్పుడు సీఎం అవుతారో ఎవరికీ తెలియదు. అప్పుడు మన పరిస్థితి తారుమారైపోతుంది’’ అని జోక్ చేయడంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. వరుణ్‌గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించే ఆయనీ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.