- మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో చాటింపులు
- బోనం ఎత్తితే, బతుకమ్మతో ఎదురొస్తే డబ్బులిస్తామని ప్రకటనలు
- ఆత్మగౌరవానికి వెలకట్టడం అహంకారానికి పరాకాష్ఠ అంటూ రేవంత్ ఆగ్రహం
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో బోనం ఎత్తితే, బతుకమ్మతో ఎదురొస్తే డబ్బులిస్తామని చాటింపు వేయడంపై తీవ్రంగా స్పందించారు.
‘‘బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవం.. తెలంగాణ సంస్కృతికి సంకేతం. అలాంటి ఆత్మగౌరవానికి వెలకట్టడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠ. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం. బీఆర్ఎస్ పతనానికి సంకేతం” అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వీడియోను, ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తనను కెలకొద్దని, తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తానని ఇటీవల ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన క్యాడర్ తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు.
ఆయన పాదయాత్ర చేయాల్సిన గ్రామాల్లో ముందురోజు చాటింపు వేయిస్తున్నారు. ‘‘మర్రి జనార్దన్ రెడ్డి మూడింటికి మన ఊర్లోకి వస్తున్నారు. బోనం ఎత్తుకుని వస్తే రూ.300, బతుకమ్మతో వస్తే రూ.200, ఎవరైనా డ్యాన్స్ చేస్తే ఒక ఫుల్ బీర్ ఇస్తారు” అని చాటింపు వేయించారు.