- తనను సగం తెలంగాణ వాడిగానైనా చూడాలన్న కేవీపీ
- తెలంగాణలో కలుపుకోవాలని కాంగ్రెస్ నేతలను కోరిన వైనం
- కేవీపీ ఏపీకి వెళ్లి పని చేయాలంటూ వీహెచ్ కౌంటర్
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుపై మరో సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే తనను సగం తెలంగాణ వాడిగానైనా చూడాలని కేవీపీ అన్నారు. దశాబ్దాలుగా తాను తెలంగాణలోనే ఉన్నానని, తనను తెలంగాణలో కలుపుకోవాలని కాంగ్రెస్ నేతలను కోరారు. ప్రాణం పోయిన తర్వాత కూడా తాను తెలంగాణ మట్టిలోనే కలసిపోతానని చెప్పారు.
కేవీపీ చేసిన ఈ వ్యాఖ్యలకు వీహెచ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఏపీలో పార్టీ బలహీనంగా ఉందని, అందువల్ల కేవీపీ ఏపీకి వెళ్లి పని చేస్తే బాగుంటుందని అన్నారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.