Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ
  • 16 రోజుల పాటు విచారణ జరిపిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం
  • రాతపూర్వక వాదనలకు మరో మూడు రోజుల సమయం ఇచ్చిన ధర్మాసనం

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల మారథాన్ విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.

జస్టిస్ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ ముగింపు రోజైన నేడు (మంగళవారం) సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబాల్, గోపాల్ సుబ్రమణియం, రాజీవ్‌ ధావన్‌, జఫర్‌ షా, దుష్యంత్‌ దవే తదితరుల రిజాయిండర్‌ వాదనలను ఆలకించింది.

పిటిషనర్లు లేదా ప్రతివాదుల తరపున హాజరయ్యే న్యాయవాదులు ఎవరైనా రాతపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే రానున్న మూడు రోజుల పాటు కోర్టుకు సమర్పించవచ్చునని ధర్మాసనం సూచించింది. అయితే రాతపూర్వక వాదనలు రెండు పేజీలకు మించి ఉండకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది..

16 రోజుల పాటు జరిగిన విచారణలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి గిరి తదితరుల వాదనలను సుప్రీం కోర్టు సావధానంగా వింది.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 అగస్ట్ 5న రద్దు చేసింది. ఈ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించేందుకు సీజేఐ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పటైంది. తొలుత ఈ పిటిషన్లపై అనుకూల, ప్రతికూల పార్టీల నుంచి దస్త్రాలు, రాతపూర్వక వివరణలను జులై 27 వరకు స్వీకరించింది. ఆ తర్వాత అగస్ట్ 2వ తేదీ నుండి పూర్తిస్థాయిలో విచారణను ప్రారంభించింది. సోమ, శుక్రవారాలు మినహా మిగతా రోజుల్లో పిటిషన్లపై రోజువారీ విచారణను చేపట్టింది.

Related posts

వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతకు అరెస్ట్ వారెంట్ జారీ

Ram Narayana

కవితకు తీవ్ర నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు..

Ram Narayana

ఎట్టకేలకు రాహుల్ గాంధీకి ఊరట.. జైలు శిక్ష అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు!

Ram Narayana

Leave a Comment