- కరోనా బారిన పడ్డ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
- ఏడాది క్రితం కూడా కరోనా బారిన పడిన జిల్
- జో బైడెన్ కు నెగెటివ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ (72) కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. డెలావర్ లోని రెహోబోత్ బీచ్ ప్రాంతంలో ఉన్న నివాసంలో ఆమె ఉన్నారని వెల్లడించింది. ఏడాది క్రితం కూడా ఆమె కరోనా బారిన పడింది. ఈ క్రమంలో 80 ఏళ్ల జో బైడెన్ కు కూడా నిన్న సాయంత్రం కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే, ఆయనకు నెగెటివ్ అని తేలింది. జిల్ బైడెన్ కు కోవిడ్ సోకిన కారణంగా జో బైడెన్ కు రెగ్యులర్ గా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తారని, కరోనా లక్షణాలను పరిశీలిస్తారని వైట్ హౌస్ తెలిపింది. మరోవైపు అమెరికాలో తాజాగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.