Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు హెలికాప్టర్ ఆఫర్ చేశాం..ఆయన నిరాకరించారు: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్

  • నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
  • చంద్రబాబు వయసును దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న అడిషనల్ డీజీ
  • ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో లోకేశ్ ను విచారిస్తామని వెల్లడి

స్కిల్ డెవలస్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ ఈ ఉదయం ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ మాట్లాడుతూ… చంద్రబాబును విజయవాడకు తీసుకురావడానికి హెలికాప్టర్ ను అరేంజ్ చేశామని, అయితే హెలికాప్టర్ ను ఆయన నిరాకరించారని చెప్పారు. రోడ్డు మార్గంలోనే వస్తానని చంద్రబాబు చెప్పారని తెలిపారు. 

చంద్రబాబు వయసును, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంజయ్ చెప్పారు. ఇప్పటికే 50 శాతం ప్రయాణం పూర్తయిందని తెలిపారు. ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని… సాయంత్రం 6 లోగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా విచారిస్తామని తెలిపారు. ఈ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో కూడా లోకేశ్ ను లోతుగా విచారిస్తామని చెప్పారు.

చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కారణం ఇదే: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ

Chandrababu is main accused in Skill Development scam says AP CID Additional DG Sanjay

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ఈ అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో చంద్రబాబును అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు. 

ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వాటిల్లిందని అడిషనల్ డీజీ చెప్పారు. షెల్ కంపెనీలకు ఈ డబ్బును తరలించారని అన్నారు. చంద్రబాబు చెపితేనే అగ్రిమెంట్లు జరిగాయని చెప్పారు. ఇందులో చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. 

ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా నియమించారని తెలిపారు. ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టారని అన్నారు. 

ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా దీనిపై విచారణ జరిపాయని చెప్పారు. నకిలీ ఇన్ వాయిస్ ల ఆధారంగా నగదు బదిలీ చేశారని తెలిపారు. న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. అన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పదని అన్నారు. ఈ కేసులోని ఇతర నిందితులు దుబాయ్, యూఎస్ లలో ఉన్నారని… వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయా దేశాలకు అధికారులు వెళ్తారని చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్.. జగన్ పై నిప్పులు చెరిగిన బాలకృష్ణ

Balakrishna fires on Jagan after Chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ నిప్పులు చెరిగారు. జగన్ పాలకుడు కాదని… ఆయనొక కక్షదారుడని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టుగా జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఇది కావాలనే రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అని చెప్పారు. 

19.12.2021 లో ఎఫ్ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని బాలయ్య ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింపజేసినప్పుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హైకోర్టు చెప్పలేదా? అని అడిగారు. మళ్లీ తప్పుల మీద తప్పులు చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని… ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.

రాజకీయ అంశాలను వ్యక్తిగత కక్షగా మార్చుకుని చంద్రబాబుపై పగ సాధిస్తున్నారు: కనకమేడల

Kanakamedala strongly condemns Chandrababu arrest

తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిరికింద చర్య అని అభివర్ణించారు. 

అర్ధరాత్రి వేళ నాయకులను అరెస్ట్ చేయడం, కార్యకర్తలను రోడ్లపైకి రానివ్వకుండా చేయడం, నాయకులెవరూ ప్రతిఘటించడానికి వీల్లేకుండా చేయడం, రాష్ట్రమంతటా ఒక ఆందోళనకర పరిస్థితిని సృష్టించడం అప్రకటిత ఎమర్జెన్సీ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. 

ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని కనకమేడల అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకపు పాలనకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు పరిశీలించి, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

“న్యాయపరమైన అంశాలు అని ఎందుకు చెబుతున్నానంటే… రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు అంటే కనీస గౌరవం లేదు. ఇక్కడి హైకోర్టు కానీ, అక్కడి సుప్రీంకోర్టు కానీ 250 కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టాయి. చీము నెత్తురు ఉన్నవాడైతే ఎప్పుడో రాజీనామా చేసి వెళ్లిపోయేవాడు” అంటూ కనకమేడల ధ్వజమెత్తారు. రాజకీయపరమైన అంశాలను వ్యక్తిగత కక్షగా మార్చుకుని చంద్రబాబుపై పగ సాధిస్తున్నారని విమర్శించారు. 

“రాజకీయాల్లో సాధారణంగా శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. కానీ ప్రత్యర్థులను శత్రువులుగా మార్చి, ఒక ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఏపీ సీఎం బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఒకసారి పరిశీలించండి. అతడు ఫ్యాక్షనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. దానికి అధికారం తోడైంది. పోలీసుల వత్తాసుతో, రాజ్యాంగాన్ని కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పిరికిపంద చర్య అవుతుందే తప్ప, చట్టబద్ధమైన చర్య కాదు” అని కనకమేడల స్పష్టం చేశారు.

అక్రమ గృహ నిర్బంధాలు, అరెస్టులకు కారకుడు సజ్జలే: దేవినేని ఉమ

Devineni Uma slams Sajjala

నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అయితే, ముందుజాగ్రత్తగా పోలీసులు ఎక్కడిక్కడ టీడీపీ నేతలు గృహనిర్బంధం చేస్తున్నారు. కొందరు నేతలను పీఎస్ లకు తరలిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ భవానీపురం పీఎస్ కు తరలించారు. 

చంద్రబాబు అరెస్ట్ పై ఉమ తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలోనే అక్రమ గృహ నిర్బంధాలు, అరెస్టుల పర్వం సాగుతోందని ఆరోపించారు. ఇలా వేలమంది పోలీసులతో టీడీపీ నేతలను నిర్బంధిస్తుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని ఉమ పేర్కొన్నారు. దీనికంతటికీ కారకుడు సజ్జలేనని మండిపడ్డారు. 

చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ కార్యకర్తలే కాకుండా, సాధారణ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసమే పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఉమ విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ కు రాబోయే రోజుల్లో తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహజ్వాలలు…సీఎల్పీ నేతను కలిసిన సీనియర్లు …

Drukpadam

ఆస్ట్రేలియా ఎన్నికల్లో తమాషా.. లోదుస్తుల్లో వచ్చి ఓటేసిన స్త్రీపురుషులు!

Drukpadam

దర్శనం విషయంలో గొడవ.. కాశీ గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, ఆలయ సిబ్బంది!

Drukpadam

Leave a Comment