- ఏసీబీ కోర్టుకు చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
- జైల్లో చంద్రబాబును ఉంచడం ప్రమాదకరమని వ్యాఖ్య
- పశ్చిమబెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను ప్రస్తావిస్తామన్న సీనియర్ న్యాయవాది
టీడీపీ అధినేత చంద్రబాబు తరపున నిన్న విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా కాసేపటి క్రితం ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఆయన వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన చెప్పారు. జైల్లో చంద్రబాబును ఉంచడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. గతంలో పశ్చిమబెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను కోర్టులో ప్రస్తావిస్తామని తెలిపారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని చెప్పారు.
జైల్లో చంద్రబాబు ఏం తిన్నారు? ఏం తాగారు?
- జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక గది, ప్రత్యేక వసతులు
- ఆయనున్న బ్లాక్ చుట్టూ భారీ భద్రత
- ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతి
తన జీవితంలో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు స్నేహ బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. అన్ని వసతులు కల్పించారు. ఒక సహాయకుడితో పాటు, ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పించారు. అంతేకాదు ఆయన ఉన్న బ్లాక్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డ్యూటీ సిబ్బంది మినహా మరెవరినీ అక్కడకు వెళ్లనీయడం లేదు.
చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం అల్పాహారంగా ఆయనకు ఫ్రూట్ సలాడ్ ను కుటుంబ సభ్యులు పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని సిబ్బంది అందించారు.
చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు: అచ్చెన్నాయుడు
- తనకూ సమాచారం ఇవ్వలేదని చెప్పారన్న టీడీపీ నేత
- రాజకీయ కక్షతో అక్రమ కేసు బనాయించారని ఆరోపణ
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ నేతలు సోమవారం ఉదయం గవర్నర్ ను కలిశారు. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో గంటా శ్రీనివాస రావు, గండి బాబ్జి, చిరంజీవిరావు, రామారావు, రాజబాబు తదితరులు విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఆదివారం ఉదయమే గవర్నర్ ను కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నించగా.. గవర్నర్ అపాయింట్ మెంట్ ను రద్దు చేశారు. దీంతో టీడీపీ నేతలు సాయంత్రం మరోమారు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా.. సోమవారం ఉదయం అపాయింట్ మెంట్ ఇచ్చారు.
గవర్నర్ ను కలిసి బయటకు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని గవర్నర్ చెప్పారన్నారు. రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నట్లు వివరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఓ శాడిస్ట్, సైకో కూడా ఇలాంటి దుర్మార్గపు అరెస్టుకు ఆదేశించరని చెప్పారు. యువనేత లోకేశ్ పాదయాత్రను ప్రజలు విశేషంగా ఆదరించడం చూసి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ నేతలకు అర్థమైందన్నారు. ఐ ప్యాక్ టీమ్ జరిపిన సర్వేలో అధికార పార్టీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీ చిరునామా గల్లంతేనని తేలిందని అచ్చెన్నాయుడు చెప్పారు. దీంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్: జగన్ ప్రభుత్వంపై నందమూరి చైతన్యకృష్ణ ఆగ్రహం
- నీతి, న్యాయం, ధర్మం ఓడిపోయాయన్న చైతన్యకృష్ణ
- చంద్రబాబును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
- దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారని ఆగ్రహం
- జగన్ ప్రభుత్వానికి చమరగీతం పాడుదామని పిలుపునిచ్చిన చైతన్యకృష్ణ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌తో నిన్న ఓడిపోయింది కేవలం ఆయనే కాదని, నీతి, న్యాయం, నిజాయతీ, ధర్మం ఓడిపోయాయని, అవినీతి మాత్రం గెలిచిందని నందమూరి జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్యకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయించి, ఆయనను జైలుపాలు చేసిందన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో వేశారన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని, కానీ నిబంధనలు పాటించకుండానే అరెస్ట్ చేశారన్నారు. కనీసం ఎఫ్ఐఆర్‌లో కూడా టీడీపీ అధినేత పేరు లేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆయనను ఎలా అరెస్ట్ చేశారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడవద్దన్నారు. నేను చైతన్యకృష్ణను, బాబాయ్ బాలకృష్ణ, లోకేశ్.. మేమంతా అండగా నిలబడతామన్నారు. ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుతామని, చంద్రబాబును కాపాడుకుంటామన్నారు. లక్ష కోట్లు తిన్నవాడు బయట తిరుగుతున్నాడని, ఒక్క రూపాయి కూడా తిననివాడు జైల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గులేని ప్రభుత్వమన్నారు.
ధైర్యం కోల్పోవద్దు: నారా లోకేశ్ కు సీపీఐ రామకృష్ణ ఫోన్
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ శ్రేణులతో పాటు విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రానికి ఇదొక దుర్దినమని, చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడుతున్నాయి. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ కు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఫోన్ చేశారు. చంద్రబాబు పట్ల సీఐడీ వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ధైర్యాన్ని కోల్పోవద్దని, మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. చంద్రబాబు విషయంలో సీపీఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. విపక్ష నేతలపై పోలీసులు దుందుడుకు వైఖరిపై విజయవాడలో రేపు అఖిలపక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ చేపట్టిన బంద్ లో టీడపీ శ్రేణులతో పాటు జనసేన, సీపీఐ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, నిరసనలపై పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల సూచనలు, సలహాల మేరకు తదుపరి కార్యాచరణకు ప్రణాళిక రూపొందించారు.
ఈ సందర్భంగా, తమకు మద్దతిచ్చిన జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని లోకేశ్ తెలిపారు. టీడీపీ నిరసనలను అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడుతున్నారని ఆరోపించారు.
కాగా, ఈ సాయంత్రం 6 గంటలకు లోకేశ్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జైలు సమీపంలోని విద్యానగర్ క్యాంప్ సైట్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ నేత కే లక్ష్మణ్ స్పందన
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. ఎలాంటి వివరణ అడగకుండా టీడీపీ అధినేతను అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండానే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ తప్పుబడుతోందన్నారు.
మరోవైపు, చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. హౌస్ రిమాండ్ కంటే చంద్రబాబుకు రాజమండ్రి కేంద్రకారాగారంలోనే భద్రత ఉంటుందని సీఐడీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో కేంద్రకారాగారంలో భద్రతపై మరింత వివరణ కావాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగారు. చంద్రబాబుకు ముప్పు విషయంలో సంబంధిత అంశాలను లూథ్రా… న్యాయమూర్తికి వివరించారు.
చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్, సీఐడీ రిమాండ్ రిపోర్టుపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు స్పందించారు. సీఐడీ విచారణ అధికారి దాఖలు చేసిన నివేదిక మొత్తం కాకమ్మ కబుర్లుగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు సమాచారంతో చంద్రబాబుపై కోర్టులో వాదనలు వినిపించారన్నారు. కేసుకు సంబంధంలేని ఉదాహరణలతో గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన తీర్పులను కూడా తప్పుగా అన్వయించి చూపినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఇచ్చిన తీర్పులను తప్పుగా ప్రస్తావించారన్నారు.
విచారణాధికారి కోర్టుకు సమర్పించినట్లుగా సోషల్ మీడియాలో వస్తోన్న రిమాండ్ రిపోర్టును తాను చదివానని పేర్కొన్నారు. దీని ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి నాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అందులో పేర్కొన్నారన్నారు. కాబట్టి పీసీ యాక్ట్ 17ఏ ప్రకారం నడుచుకోలేదన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న మిగతా విషయాలు అధికారుల పనితీరును దెబ్బతీస్తాయన్నారు. వీటిని కాకమ్మ కబుర్లుగా చెప్పవచ్చునన్నారు.
ఈ వయస్సులో అరాచకంగా అరెస్ట్.. 60 గంటలు నిద్రలేకుండా చేశారు: హర్షకుమార్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ దారుణమని, తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన రాజమండ్రి కేంద్రకారాగారం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏడుపదులు దాటిన వయస్సులో చంద్రబాబును అక్రమ కేసులతో జైలుకు పంపించడం సరికాదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని హింసించి, వేధించడం ఏమిటన్నారు. ఓ మానసిక రోగి సంతృప్తి కోసం కొన్ని వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో ఈ వ్యవహారం స్పష్టం చేసిందన్నారు. అధికారుల తీరును హర్షకుమార్ తప్పుబట్టారు.
అరెస్ట్ చేసిన తీరు బాధాకరమన్నారు. అరాచకంగా ఆయనను తీసుకెళ్లారని, నంద్యాలలో అరెస్ట్ చేసి, విజయవాడలో రోజంతా విచారించి, ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్లారన్నారు. ఆయనకు దాదాపు అరవై గంటలు నిద్రలేకుండా చేశారని, ఇది చాలా బాధించిందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదని, కాబట్టి బీజేపీ, వైసీపీ ఒక్కటేనని తెలుసుకోవాలని హితవు పలికారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు అండగా ఉంటామని చెప్పారు.