Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

దోచుకున్న దొంగను పట్టుకుంటే ప్రశంసించకుండా విమర్శలు చేస్తావా?: పవన్ పై పేర్ని నాని ఫైర్

  • అవినీతి చేసి దొరికిన దొంగను ఓదార్చడానికి వెళ్తావా? అని పేర్ని నాని నిలదీత
  • బాబు-పవన్ ది ములాఖత్ కాదు.. మిలాఖత్ అని విమర్శ
  • పవన్ వెళ్ళింది ఓదార్పు కోసం కాదు… సెటిల్మెంట్ కోసమని ఆరోపణ
  • అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పి ఇప్పుడేం చేస్తున్నావని నిలదీత
  • నీ కోసం కాకపోయినా నిన్ను నమ్ముకున్న యువత కోసం నిజాయతీగా మాట్లాడాలని హితవు

రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసి దొరికిన చంద్రబాబును ఓదార్చడానికి పవన్ వెళ్లడం విడ్డూరమన్నారు. నిన్నటి దాకా టీడీపీ అధినేతను, లోకేశ్‌ను తిట్టిన పవన్ ఇప్పుడు పొత్తుల కోసం, సీట్లు మాట్లాడేందుకు వెళ్లారా? అని నిలదీశారు. ప్రజాధనం దోచుకున్న దొంగను పరామర్శించడమా? అని ప్రశ్నించారు. బాబు-పవన్‌ది ములాఖత్ కాదని, మిలాఖత్ అని విమర్శించారు. పవన్ కొత్తగా హిందూమతం తీసుకున్నట్లుగా ఓదార్పు కోసం వెళ్లినట్లు ఉన్నాడని ఎద్దేవా చేశారు. అయినా ఆయన వెళ్లింది ఓదార్పు కోసం కాదని, సెటిల్మెంట్ కోసమన్నారు.

చంద్రబాబును పరామర్శించేందుకు జైలు లోనికి వెళ్లే వరకు ఓదార్పు అన్నాడని, బయటకు వచ్చాక పొత్తులు అని సెటిల్మెంట్ గురించి చెప్పాడన్నారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబు వెంటే ఉంటారని, కానీ మధ్యలో బీజేపీని ఉపయోగించుకుంటున్నారన్నారు. 2019లో మోదీ కోసం వచ్చానని, 2019లో చంద్రబాబు చెవిలో ఏదో చెప్పాడని కమ్యూనిస్టుల వైపు వెళ్లాడని, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడని విమర్శలు గుప్పించారు. వాడుకొని వదిలేసే చంద్రబాబుతో పవన్ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నాడో చెప్పాలన్నారు.

అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని నిత్యం చెప్పే జనసేనాని అవినీతి చేసిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే తమను ప్రశంసించాల్సింది పోయి విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. అసలు జనసేనకు ఉన్న సిద్ధాంతం ఏమిటని నిలదీశారు. మేం దత్తపుత్రుడు అని మాట్లాడితే పవన్‌కు కోపం వస్తోందని, కానీ చంద్రబాబు ఏం చేసినా మద్దతు పలుకుతున్నాడన్నారు.

అవినీతిపనులు చేసినందుకు ఈ రోజు మీ తమ్ముడు (నారా లోకేశ్)ను వాటేసుకున్నావా? అని ప్రశ్నించారు. అయిదేళ్లలో కొట్టేసిన డబ్బును నీకు సగం ఏమైనా ఇచ్చాడా? అని పవన్‌ను ప్రశ్నించారు. అప్పుడు తమ్ముడు లోకేశ్, బాబాయ్ చంద్రబాబు కలిసి దోచేశారని ఆరోపించి, ఇప్పుడు లోపల లెక్కలు పంచుకొని, బయట సీట్లు పంచుకున్నట్లు చెబుతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన జెండా మోసే కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నావని నిలదీశారు. నాడు వారిని దొంగలు అన్నావ్.. మీ తమ్ముడ్నీ దొంగ అన్నావ్, లూటీకోరు అన్నావ్.. చంద్రబాబు ప్రజాధనం తీసుకెళ్లి హెరిటేజ్‌లో పెట్టాడని విమర్శించావ్.. ఇప్పుడు మళ్లీ ఎందుకు కలిశావో చెప్పాలన్నారు.

పవన్ కల్యాణ్‌లో తేడా ఉందని తమలాంటి వారు చెబితే విమర్శలు చేస్తాడని, వైసీపీలో ఎవరినీ వదలనని ఈ రోజు చెబుతున్నారని, తాట తీస్తానని చెబుతున్నారని, కానీ ఆయన ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో ఎవరికీ తెలియదన్నారు. కమ్యూనిస్ట్, బీఎస్పీ, బీజేపీ, టీడీపీ ఎన్ని పార్టీలు మారుస్తాడని ప్రశ్నించారు. ఇంకా నీదో రాజకీయ పార్టీ.. దానికో గుర్తునా? అంటూ ఎద్దేవా చేశారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఏమైనా లాభమా? అనేది చెప్పాలన్నారు.

పవన్ నీ కోసం కాకపోయినప్పటికీ… నిన్ను నమ్ముకున్న యువత కోసం, మీ జెండాను చిత్తశుద్ధితో మోసే వారి కోసం సమాధానం చెప్పాలన్నారు. నీవు చేసేది సరైనదేనా అని నీ అంతరాత్మకు తెలియాలన్నారు. జెండా మోసే ముక్కుపచ్చలారని పిల్లల కోసం నిజాయితీగా ఉండాలని మా లాంటి వాళ్లం పవన్‌ను కోరుకుంటున్నామన్నారు. దోచుకున్న దొంగను పట్టుకుంటే తమను ప్రశంసించకుండా విమర్శలు చేస్తావా? అని నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.370 కోట్లు అని చిన్న మొత్తంగా చూస్తున్నారని, కానీ జగన్ తీగలాగుతున్నారని, అప్పుడు ఎంత దోచాడో తెలిస్తే నీవే ఆశ్చర్యపోతావని పవన్‌ను ఉద్దేశించి అన్నారు.

పవన్ ఆ ఒక్కమాట చెబితే మేం మళ్లీ ప్రశ్నించం

రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసిన అనంతరం పొత్తు ప్రకటన చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చిరంజీవిని చూస్తే అలా ఉన్నాడు… కానీ చిన్నోడిని (పవన్ కల్యాణ్‌ను ఉద్ధేశించి) చూస్తే ఇలా అయ్యాడనే బాధ తమకూ ఉందన్నారు. జనసేనాని తెరమీద హీరోగా ఉన్నాడని, అలాగే కొనసాగితే మంచిదని, రాజకీయాల్లోకి వచ్చి జోకర్ వేషాలు వేయడం ఎందుకని ప్రశ్నించారు. పవన్ తెరపై హీరో అయితే రాజకీయాల్లో జోకర్ అన్నారు.

మీ అమ్మగారిని, కుటుంబ సభ్యులను తిట్టిన టీడీపీతో ఎలా కలిశావో చెప్పాలన్నారు. నువ్వైతే క్షమించావ్ అనుకుంటే, జెండా మోసిన మీ అభిమానులు, కేడర్ పరిస్థితి ఏమిటి? అన్నారు. వారిని బాలకృష్ణ ఏమన్నాడో అందరికీ తెలుసు అన్నారు. 

తాను చంద్రబాబు కోసమే పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ చెబితే తాము అతనిని మరోసారి ప్రశ్నించమని స్పష్టం చేశారు. కానీ ఆయన దొంగమాటలు చెబుతున్నాడన్నారు. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందని, అలాగే తనకూ ఉందన్నారు. తాను చంద్రబాబు కోసం పార్టీ పెట్టానని, ఆయన కోసమే పని చేస్తున్నానని పవన్ ఒక్కమాట చెబితే తాము మళ్లీ ప్రశ్నించమని, అలా చెప్పాక కూడా అడిగితే తమపైకి ఒక చెప్పు కాదు.. పది చెప్పులు తియ్ అన్నారు

Related posts

నారాయణకు టీడీపీ టికెట్ నేపథ్యంలో.. కేతంరెడ్డి జనసేనకు గుడ్ బై….

Ram Narayana

విలువలు లేని రాజకీయాలు వచ్చేశాయ్.. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను: జగన్

Ram Narayana

హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన లోకేశ్, ప్రశాంత్ కిశోర్… కాసేపట్లో చంద్రబాబుతో భేటీ!

Ram Narayana

Leave a Comment