- కొన్ని నెలలుగా రక్షణ మంత్రి షాంగ్‌పూ అధికారిక సమావేశాలకు హాజరుకాని వైనం
- మంత్రి అకస్మాత్తుగా తెరమరుగు కావడంతో కలకలం
- త్వరలో ఆయన పదవీచ్ఛితుడు కాబోతున్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు
చైనాలో మరో మంత్రి అదృశ్యమయ్యారు. ఈ మారు ఏకంగా రక్షణ శాఖ మంత్రి షాంగ్‌పూ పత్తాలేకుండా పోయారు. మే నెలలో ఇలాగే అకస్మాత్తుగా తెరవెనక్కు వెళ్లిపోయిన విదేశాంగ శాఖ మంత్రి కిన్ గాంగ్ ఆ తరువాత తన పదవికి దూరమయ్యారు. ఆయన బాధ్యతలను గతంలో విదేశాంగ శాఖ నిర్వహించిన వాంగ్ యీకి అధ్యక్షుడు జిన్ పింగ్ కట్టబెట్టారు. దీంతో, ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి కూడా తన పదవి కోల్పోనున్నారా? అన్న ఊహాగానాలు చైనాలో సంచలనం కలిగిస్తున్నాయి.
అధ్యక్షుడు జిన్ పింగ్ నేతృత్వంలో శుక్రవారం సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు రక్షణ మంత్రి హాజరురాలేదు. అంతేకాకుండా ఈ నెల 7,8 తేదీల్లో వియత్నాం రక్షణ అధికారులతో జరిగిన సమావేశంలోనూ మంత్రి కానరాలేదు. దీంతో, ఆయన పదవి కోల్పోవడం గ్యారెంటీ అన్న ఊహాగానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఇటీవల కాలంలో చైనాలో పలువురు మంత్రులు, ప్రముఖులు అకస్మాత్తుగా తన ప్రాముఖ్యాన్ని కోల్పోయి తెరమరుగవుతున్న విషయం తెలిసిందే.