- పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము
- కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషెస్
- 73వ వసంతంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రధానికి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు తదితరులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను ఆదివారం ప్రారంభించనుంది. ‘క్షేమ ఆయుష్మాన్ భవ’ పేరుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ, సేవా పఖ్వారా పేరుతో మరో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన భారీ కట్టడం యశోభూమిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. విశ్వకర్మ జయంతి కావడంతో ‘విశ్వకర్మ కౌశల్ యోజన’ను ప్రారంభించనున్నారు.