Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కెనడాతో వివాదం నేపథ్యంలో అక్కడి ఎన్నారైలకు కేంద్రం కీలక సూచన

  • ఎక్స్ వేదికగా పలు సూచనలు జారీ చేసిన విదేశాంగ శాఖ ప్రతినిధి
  • కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని వ్యాఖ్య
  • వీటిని వ్యతిరేకించేవారికి బెదిరింపులు ఎదురుకావచ్చని హెచ్చరిక
  • గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లొద్దని ఎన్నారైలు, భారతీయ విద్యార్థులకు సూచన

కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో అక్కడి ఎన్నారైలు, భారత విద్యార్థులకు కేంద్రం తాజాగా కీలక సూచన చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ఆమోదంతో నేరాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారత్‌లోని కెనడా పౌరులకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్తలే చెప్పిన మరుసటి రోజే కేంద్రం ఎన్నారైలకు ఈ సూచనలు చేయడం గమనార్హం. 

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’ వేదికగా కెనడాలోని ఎన్నారైలను ఈ మేరకు హెచ్చరించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకించే భారతీయ దౌత్యవేత్తలు, భారతీయులకు బెదింపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి, గతంలో అలాంటి ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. అయితే, కెనడాలోని భారత దౌత్యకార్యాలయాలు స్థానిక అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఎన్నారైల భద్రత కోసం కృషి చేస్తున్నాయని భరోసా ఇచ్చారు. 

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో సంచలన ఆరోపణలు చేశాక ఇరు దేశాల మధ్య వివాదం పతాకస్థాయికి చేరిన విషయం తెలిసిందే.

జీ20 సమావేశాలకు ముందే భారత్‌‌ను టార్గెట్ చేసిన కెనడా.. మోదీకి ఇబ్బందని అమెరికా సైలెన్స్

  • భారత్, కెనడా వివాదంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం
  • మిత్రదేశాలతో నిజ్జార్ హత్యపై కెనడా సంప్రదింపులు జరిపినట్టు వెల్లడి
  • భారత్ తీరును బహిరంగంగా ఖండించాలని కోరిన కెనడా
  • జీ20 సమావేశాలకు ముందు ఈ అంశంపై స్పందించేందుకు అమెరికా సహా పలు దేశాల విముఖత
  • మోదీకి జీ20 సమావేశాలు కీలకమని భావించి సంయమనం పాటించినట్టు వెల్లడి
Canada Sought US Condemnation Of India Was Met With Reluctance

కెనడా పౌరుడు, ఖలిస్థానీ వేర్పాటువాద మద్దతుదారుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. అయితే, జీ20 సమావేశాలకు ముందే కెనడా తన మిత్రదేశాలతో నిజ్జర్ హత్య విషయమై సంప్రదింపులు జరిపిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. భారత్ తీరును బహిరంగంగా ఖండించాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించింది. 

అయితే, అమెరికా సహా అనేక దేశాలు ఈ తరహా ప్రకటన చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని పేర్కొంది. జీ20 సమావేశాలు ప్రధాని మోదీకి కీలకమని భావించిన ఆయా దేశాలు బహిరంగ ప్రకటనకు వెనకాడాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అంతేకాదు, భారత్‌తో దౌత్యసంబంధాలు నెరపడంతో అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లకు ఇది ఓ నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది. తనతో పాటుగా ఫైవ్ ఐస్ దేశాలుగా పేరుపడ్డ అమెరికా, బ్రిటన్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలతో కెనడా ఈ సంప్రదింపులు జరిపినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 

హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిని భారత్‌కు రప్పించే దిశగా కెనడాతో చర్చలు జరుపుతోంది. 2022లో పంజాబ్‌లో ఓ అర్చకుడి హత్య వెనకు అతడి పాత్ర ఉందని కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నిజ్జర్‌ను కెనడాలోని ఓ గురుద్వారా ఎదుట ఇద్దరు ఆగంతుకులు కాల్చి చంపేశారు. 

ఈ హత్య వెనుక భారత్ ఏజంట్ల హస్తం ఉందంటూ ప్రధాని ట్రూడో కెనడా పార్లమెంటులో సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా, భారత దౌత్యవేత్తను కూడా కెనడా బహిష్కరించింది. కెనడా చర్యకు భారత్ దీటుగా స్పందించింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్త ఐదు రోజుల్లోపు దేశం వీడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ దౌత్యవేత్త కెనడా తరపున భారత్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అనుమానంతోనే అతడిని భారత్ బహిష్కరించిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. 

ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ట్రూడో మరోసారి స్పందించారు. భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే ఈ విషయంపై భారత్ దృష్టిసారించాలని కోరారు.  ఖలిస్థానీ వేర్పాటువాదంపై కఠినచర్యలు తీసుకోవాలంటూ సిక్కులు ఎక్కువగా వున్న కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలపై భారత్ ఒత్తిడి తెస్తోందని కూడా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 

భారత్‌తో వివాదం.. కెనడాకు నిప్పుతో చెలగాటమే!: అంతర్జాతీయ నిపుణులు

Experts warn canada PM against entering fued with india

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పెను దూమారం రేపాయి. ఈ ఆరోపణలపై అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై అమెరికా మేధోమధన సంస్థ హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ వేదికగా అంత్జాతీయ వ్యవహారాల నిపుణుల చర్చ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు కెనడా తీరును దుయ్యబట్టారు. 

ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంత మంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారని ఈ కార్యక్రమంలో నిపుణులు మండిపడ్డారు. ఖలిస్థానీ నేత హత్యను భారత నిఘావర్గాలకు అంటగడుతూ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ఇది ట్రూడోకు దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినా నాయకత్వ లక్షణం మాత్రం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోరాదని తాము భావిస్తున్నామని తెలిపారు. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని వ్యాఖ్యానించారు.   

ఇక తాజా వివాదంతో అమెరికా పెద్ద ఇరకాటంలో పడింది. సన్నిహిత మిత్రదేశమైన కెనడా ఓవైపు, వ్యూహాత్మక భాగస్వామి భారత్ మరోవైపు ఉండటం అమెరికాకు తలనొప్పిగా మారింది.

Related posts

కిక్కిరిసి.. కుక్కేసినట్టు.. అక్కడ అంత మంది జనమా?

Ram Narayana

కెనడా ప్రధాని సభలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు!

Ram Narayana

అమెరికా వీసా ఇంటర్వ్యూలో ఫెయిలైన వారికి ఓ గుడ్ న్యూస్!

Ram Narayana

Leave a Comment