రాత్రి కురిసిన భారీ వర్షానికి మునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు
- గతరాత్రి ఒక్కసారిగా ముంచెత్తిన వాన
- మునిగిన ఇళ్లు, రోడ్లు, నివాస ప్రాంతాలు
- స్కూళ్లకు సెలవుల ప్రకటన
- అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏకంగా 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నాగ్‌పూర్ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత అర్ధరాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఏకంగా 106 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణశాఖ తెలిపింది.
వరద ముంచెత్తడంతో చాలా నివాస ప్రాంతాలు, ఇళ్లు, రోడ్లు మునిగిపోయినట్టు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ ద్వారా తెలిపారు. కలెక్టర్ సహా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నగరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. వరదల్లో చిక్కుకుపోయిన 25 మందిని ఇప్పటి వరకు రక్షించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు.