మహిళా రెజ్లర్లను వేధించేందుకు అందిన ఏ అవకాశాన్నీ బ్రిజ్‌భూషణ్ వదులుకోలేదు..
కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
- మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌సింగ్
- నిన్న రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు
- బ్రిజ్‌భూషణ్ తరపు న్యాయవాదికి అతుల్ శ్రీవాస్తవ గట్టి కౌంటర్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కోసం తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్ వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిన్నరోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఆరుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులు ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ.. బ్రిజ్‌భూషణ్‌కు తాను ఏం చేస్తున్నానో తెలుసని పేర్కొన్నారు. ఆయనపై అభియోగాలు మోపేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీర్పీసీ) కింద రాతపూర్వక ఫిర్యాదు, సెక్షన్ 161 (సాక్షుల విచారణ), 164 (మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలు).. ఈ మూడు రకాల సాక్ష్యాలు సరిపోతాయని పేర్కొన్నారు.
భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్ తరపు న్యాయవాది వాదనకు అతుల్ కౌంటర్ ఇచ్చారు. నేరాలన్నీ దేశం బయట జరిగితే మాత్రమే అవసరమని వాదించారు. ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని, కాబట్టి అవసరం లేదని స్పష్టం చేశారు.