- గర్భం దాల్చిన 21 ఏళ్ల యువతి
- ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి, సోదరుడు
- కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని ప్రశ్న
గర్భం దాల్చిన 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, సోదరుడు అడవిలోకి తీసుకెళ్లి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, పెళ్లి కాకుండానే సదరు యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లి, సోదరుడు ఆగ్రహంతో ఊగిపోయారు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని ఆమెను ప్రశ్నించగా… ఆమె ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఈ క్రమంలో ఆమెను ఊరి పక్కనున్న అడవిలోకి లాక్కెళ్లి, ఆమెకు నిప్పంటించారు. అయితే ఈ ఘటనను కొందరు రైతులు గమనించారు. ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను మీరట్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మీరట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బాధితురాలి తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలో విచారిస్తున్నారు.